తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు విధించిన గడువు, బీసీ రిజర్వేషన్లు అమలుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఉభయ సభల్లో ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. అయితే, ఈ బిల్లులు ఇంకా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న నిబంధన నేపథ్యంలో, న్యాయపరమైన చిక్కులు లేకుండా ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.
బీసీ రిజర్వేషన్లు అమలుకు త్రిముఖ వ్యూహం..!
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముందు మూడు ప్రధాన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మొదటిది, రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం. ఈ బిల్లులను తమిళనాడుకు కల్పించినట్లుగా పార్లమెంట్‌లో ఆమోదించి, 9వ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా తమకు రక్షణ కల్పించాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరడం. అయితే, ఈ అంశంపై ఢిల్లీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. రెండో ప్రత్యామ్నాయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేయడం. అయితే, ఇలా చేస్తే తలెత్తే న్యాయపరమైన చిక్కుల గురించి ప్రభుత్వం న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది. న్యాయనిపుణుల సూచనల మేరకు ముందుకువెళ్లేందుకు ప్రభుత్వం చూస్తుంది. ఇక మూడో ప్రత్యామ్నాయంగా, ఈ రెండు మార్గాలు సాధ్యం కాకపోతే, పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Also Read..| హైదరాబాద్ లో బోనాల పండుగ ఉత్సవాలు ప్రారంభం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును గత మార్చిలోనే అసెంబ్లీ ఆమోదించింది. అయితే, బీసీ రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర పరిధిలో తీసుకునే నిర్ణయం కాకపోవడంతో గవర్నర్ ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ప్రస్తుతం ఇది రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన బిల్లులను మూడు నెలల్లోగా క్లియర్ చేయాలని రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గతంలో గడువు విధించింది. తెలంగాణ బీసీ బిల్లులు రాష్ట్రపతి వద్దకు చేరి త్వరలోనే మూడు నెలల గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గడువు పూర్తయ్యేవరకు వేచిచూసి, అప్పటికీ రాష్ట్రపతి నుంచి ఎలాంటి ఆమోదం రాకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది.

మరోవైపు, తెలంగాణలో కులగణన మరియు ఇక్కడి నుంచి పంపిన రిజర్వేషన్ల బిల్లుల నేపథ్యంలోనే కేంద్రం దేశవ్యాప్తంగా జనగణనతోపాటు కుల గణన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య బీసీ రిజర్వేషన్ల బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే, సమగ్ర కులగణన సర్వే వివరాలు, అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ బిల్లు ఆధారంగా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తే మొత్తం రిజర్వేషన్లు 70 శాతానికి చేరే అవకాశం ఉంది. అయితే, రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున, ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉంది.
ఈ న్యాయపరమైన చిక్కులను అధిగమించడానికి, పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూడో మార్గంగా భావిస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ, పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై త్వరలోనే పీసీసీ స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. హైకోర్టు స్థానిక ఎన్నికల నిర్వహణకు మూడు నెలల గడువు నిర్దేశించింది. ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల్లో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
బీసీ బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం ఆలస్యమైనా, నేరుగా రిజర్వేషన్లు ప్రకటించినా కోర్టులు అడ్డుకున్నా, నెల రోజుల గడువు మించిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, ఒకవేళ కేంద్రం వినకపోతే కాంగ్రెస్ పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే, 22-23 శాతం చట్టపరంగా, మరో 20 శాతం పార్టీపరంగా జనరల్ స్థానాల్లో బీసీలకు సీట్లు కేటాయించాలని ఆలోచిస్తోంది. 42 శాతం స్థానాలను బీసీలకు కేటాయిస్తే అనివార్యంగా మిగిలిన పార్టీలు కూడా అదే స్థాయిలో రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పార్టీ భావిస్తోంది. తద్వారా తాము అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని, ఆ తర్వాత కేంద్రంపై ఒత్తిడి కొనసాగించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.