Menu

pm modi to visit telangana in April

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన.. బీజేపీ వ్యూహం అదేనా ?

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఖరారయింది. ఆయన పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోందా ? రాష్ట్ర కమలం నేతలు మోడీ పర్యటనపై భారీ ఆశలు పెట్టుకోవడదానికి కారణం ఏమిటి ? ప్రధాని పర్యటన కేవలం అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితమా? లేక రాబోయే ఎన్నికలకు క్యాడర్‌కు బూస్ట్ ఇచ్చే వ్యూహాంలో భాగమా ? కాషాయదళం వేస్తున్న ఈ ఎత్తుగడ అధికార కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసరబోతోందా ? అటు తమిళనాడు, కేరళ ఎన్నికల బీజీలో కూడా, తెలంగాణపై మోడీ ప్రత్యేక దృష్టి సారించడం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏమిటి ?

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన శ్రేణుల్లో జోష్ నింపేనా..

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఖరారు కావడంతో తెలంగాణ బీజేపీలో ఒక్కసారిగా కదలిక వచ్చినట్లు కనబడతుంది. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కమలనాథులు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు దుబ్బాక, హుజూరాబాద్ విజయాల తర్వాత పార్టీలో వచ్చిన జోష్ ఇప్పుడు కనిపించడంలేదు. ఆ లోటును భర్తీ చేయడానికి, పార్టీ శ్రేణుల్లో మళ్ళీ ఆ పాత ఉత్సాహాన్ని నింపడానికి మోడీ సభను ఒక వేదికగా మలుచుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ భారీ బహిరంగ సభ ద్వారా లక్షలాది మందిని సమీకరించి, తెలంగాణలో బీజేపీకి తిరుగుండదని నిరూపించడానికి పావులు కదుపుతుంది.

రాష్ట్ర అద్యక్షుడు రాంచందర్ రావు నిర్వహిస్తున్న వరుస కార్యక్రమాలు, భేటీలతో బిజీబిజీగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతపై మోడీ నేరుగా ఆరా తీస్తారనే సంకేతాలు వెళ్లయట. అందుకే నేతలందరూ పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారట. ఏయే నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది? ఎక్కడ సంస్థాగతంగా లోపాలు ఉన్నాయి? అనే అంశాలపై ఒక సమగ్ర నివేదికను మోడీ కోరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాంచందర్ రావు, కిషన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతూ, ప్రధాని రాకముందే పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది కేవలం పర్యటన మాత్రమే కాదని, రాష్ట్ర నేతల పనితీరుకు ఒక పరీక్షా సమయం అని పార్టీలో చర్చజరుగుతుంది.

అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూనే రాజకీయ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రధాని మోడీకి వెన్నతో పెట్టిన విద్య అని పార్టీనేతలు అంటుంటారు. బీబీనగర్ ఎయిమ్స్ వంటి ప్రారంభోత్సవాల ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చే ప్రాధాన్యతను ప్రజలకు వివరించనున్నారు. “రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మేము అభివృద్ధిని ఆపలేదు” అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే బీజేపీ వ్యూహంగా కనబడుతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కేవలం శంకుస్థాపనలు, శిలాఫలకాలకే పరిమితం కాకుండా, తమకు అనుకూలంగా మలచుకోవాలని అధిష్టానం భావిస్తోంది. విద్యావంతులు, యువతను ఆకట్టుకోవడానికి ఎయిమ్స్ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు బీజేపీకి ఒక అగ్నిపరీక్ష లాంటివి. గతంలో గ్రేటర్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించి బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈసారి అంతకు మించి సత్తా చాటాలని చూస్తుంది. భాగ్యనగర ఓటర్ల నాడి తెలిసిన పార్టీగా, మోడీ పర్యటనతో ఆ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవాలని చూస్తుంది. ప్రధాని మోడీకి పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకునేందుకు పరేడ్ గ్రౌండ్ సభను ఒక పవర్‌ఫుల్ వెపన్‌గా వాడుకోవాలని చూస్తున్నారట. ఈ సభ ద్వారా గ్రేటర్ పరిధిలోని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి, వారిని ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

గతంతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ ఓటు షేర్ పెరగడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కమలం వికసిస్తుందనే నమ్మకం పెరిగింది. ఈ నేపథ్యంలో మోడీ పర్యటన ఆ నమ్మకాన్ని రెట్టింపు చేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఓటు షేర్ పెరగడమే కాదు, అది సీట్ల రూపంలోకి మారాలంటే మోడీ లాంటి మాస్ లీడర్ ప్రచారం అత్యవసరమని రాష్ట్ర నేతలు గుర్తించారు. ఈ పర్యటన తర్వాత పార్టీలో చేరికలు కూడా పెరుగుతాయని రాష్ట్ర నాయకులు ఆశిస్తున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను గమనిస్తే, ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఇది సరైన సమయం అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

ప్రధాని మోదీ పర్యటన విజయవంతం అయితే, అది తెలంగాణ బీజేపీకి ఒక కొత్త ఊపిరి పోయడం ఖాయం. పార్టీలోని గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టి, అందరినీ ఏక తాటిపైకి తీసుకురావడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని అధిష్టానం భావిస్తోంది. సభకు వచ్చే జనసమీకరణను బట్టి రాష్ట్రంలో రాజకీయాలపై ఒక స్పష్టత వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. ఎన్నికల నగారా మోగకముందే మోడీ చేస్తున్న ఈ పర్యటన, ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందని బీజేపీ శ్రేణులు ధీమాగా వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, హామీల అమలుపై జంగ్ సైరన్ పూరించాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బస్సు యాత్రలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ప్రధాని ఇచ్చే బూస్ట్‌తో క్షేత్రస్థాయిలోకి దూసుకువెళ్లాలని, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. మొత్తానికి మోడీ తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పుకు నాంది పలకబోతోందని బీజేపీ నేతలు అంటున్నారు. మోడీ మ్యాజిక్ తెలంగాణలో ఏ మేరకు పని చేస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే..

శిగుల్ల రాజు జర్నలిస్ట్ shigulla raju journalist
శిగుల్ల రాజు, జర్నలిస్ట్

Share the post

Also Read..