జనగామ నియోజక వర్గంలో గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మధ్య జరిగిన ప్రచారానికి తెర పడింది. ఈసారి జనగామ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కాదని, ఎమ్మెల్సీ పల్లా రెడ్డికి టికెట్ ఇస్తారని వార్తలు వస్తున్నప్పటి నుండి అక్కడ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయారు. పల్లాను ముత్తిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. కానీ, పార్టీ టికెట్ పల్లాకే ఇవ్వాలని నిర్ణయించి, ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి కట్టబెట్టింది. దీంతో జనగామ టికెట్ పల్లాకు ఖరారు అయింది. ఇద్దరు నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఒక్కటయ్యారు. అదే విధంగా ఈ నెల 16న జనగామలో సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లు కోసం నిన్న జనగామలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్ రావు, జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇతర నేతలు హాజరయ్యారు. మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఎమ్మెల్యే ముత్తి రెడ్డి ఎమ్మెల్సీ పల్లాకు స్వీట్లు తినిపించారు. ఆయనను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ముత్తిరెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. పల్లాను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అందరం కలిసి కట్టుగా పనిచేసి మరోసారి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామని అన్నారు.