Menu

is congress respond late in Jeevan Reddy issue ?

జీవన్ రెడ్డి అంశం లో పార్టీ లేట్ గా స్పందించిందా?

మాజీమంత్రి జీవన్ రెడ్డిఅంశం లో పార్టీ లేట్ గా స్పందించిందా? దశాబ్దాల పాటు నమ్మిన సిద్ధాంతం.. నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. కానీ ఇప్పుడు అదే పార్టీలో అవమానాలు, ఆవేదన మిగిలాయా? ఇక నా వల్ల కాదు.. నిర్ణయం తీసుకోక తప్పదు అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సంచలన నిర్ణయానికి సిద్ధమయ్యారా? సీనియర్ నాయకుడి విషయంలో అధిష్టానం కావాలనే మౌనం వహించిందా? లేక ఆయన అవసరం లేదని లైట్ తీసుకుందా? ఫిరాయింపు ఎమ్మెల్యేల కోసం నిఖార్సైన కాంగ్రెస్ వాదిని దూరం చేసుకుంటున్నారా? అసలు జగిత్యాల కోటలో ఏం జరుగుతోంది?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు.. జీవన్ రెడ్డి అంటే తెలియని వారుండరు. సుమారు 40 ఏళ్లుగా కాంగ్రెస్ జెండాను భుజాన మోసిన నాయకుడు ఆయన. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. గెలిచినా, ఓడినా ఆయన కాంగ్రెస్ గడప దాటలేదు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన సొంత నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యత తగ్గడం, ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకు రెడ్ కార్పెట్ వేయడం ఆయనను కలచివేస్తుందని ఆవేదన చెందుతున్నారు.

జీవన్ రెడ్డి అంశం కేవలం పదవి పంచాయితీయా..?

జీవన్ రెడ్డి అడిగింది పదవులు కాదు.. కేవలం గౌరవం మాత్రమే అని బహిరంగంగానే చెబుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు దక్కాలని కోరుకున్నారు. అయితే, జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకు పార్టీ అధిక ప్రాధాన్యత ఇవ్వడం వివాదానికి దారితీసింది. ముఖ్యంగా జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడి హత్య జరిగిన తరుణంలో పార్టీ వ్యవహరించిన తీరు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బి-ఫారాల కేటాయింపులో ఫిరాయింపు నేతలకే ప్రాధాన్యత ఇవ్వడం ఆయనను మరింత కుంగదీశాయి. చివరకు గాంధీ భవన్‌లో జరిగిన సమావేశంలో కూడా అవమానం ఎదురవ్వడంతో, ఆయన ఇక పార్టీలో ఉండలేననే సంకేతాలిచ్చారు.

జీవన్ రెడ్డి రాజీనామా ఆలోచన చేసిన తర్వాతే ప్రభుత్వంలోని మంత్రులు రంగంలోకి దిగారు. శ్రీధర్ బాబు వంటి నేతలు చర్చలు జరిపినప్పటికీ, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు పార్టీ ఆలస్యంగా స్పందించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి స్వయంగా జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. జీవన్ రెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిపిన మహేష్ కుమార్ గౌడ్.. ఆయన పార్టీలోనే కొనసాగాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నిర్ణయాల వల్ల ఆయన కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే, కానీ ఆయన కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు. రాజీనామా చేయొద్దని కోరాము, ఆయన సానుకూలంగా స్పందిస్తారనే ఆశతో ఉన్నానని పీసీసీ చీఫ్ అంటున్నారు. అయితే, సీనియర్ నాయకుడిని ఇంతవరకు వెళ్లనివ్వకుండా ముందే జాగ్రత్త పడితే బాగుండేదనే చర్చ క్యాడర్‌లో నడుస్తోంది.

Also Read..| ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన.. బీజేపీ వ్యూహం అదేనా ?

జీవన్ రెడ్డి వంటి బలమైన నాయకుడు పార్టీ వీడితే అది కాంగ్రెస్‌కు పెద్ద మైనస్ అవుతుందనడంలో సందేహం లేదు. ఉత్తర కాంగ్రెస్ లో పార్టీకి పెద్దదిక్కుగా ఆయన ఉన్నారు. ఆయన పార్టీని వెళ్ళిపోతే.. ఉత్తర తెలంగాణలో పార్టీకి కష్టకాలమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి, జీవన్ రెడ్డి పార్టీ వీడకుండా పీసీసీ చీఫ్ బుజ్జగింపులు ఎంతవరకు పని చేస్తాయి? జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకుంటారా? లేదా జగిత్యాల వేదికగా కొత్త రాజకీయ సమీకరణాలు మొదలవుతాయా? అన్నది వేచి చూడాలి.

shigulla Raju, Journalist
-శిగుల్ల రాజు, జర్నలిస్ట్

Share the post

Also Read..