తెలంగాణలో రానున్న ఎన్నికలకు ఇప్పటికే ఎలక్షన్ కమీషన్ తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. అక్టోబర్ మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రానికి రానున్నారు. అక్టోబర్‌లోనే ఎన్నికల ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలు డిసెంబర్ నెలలో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఒకేసారి 115 మంది అభ్యర్థులతో లిస్టు ప్రకటించి ఎన్నికలకు ప్రతిపక్షాలకంటే ముందే బీఆర్ఎస్ పార్టీ సమాయత్తం అయింది. ఇప్పుడు ప్రచారంలో కూడా అదే దూకుడు కొనసాగించాలని బీఆర్ఎస్ చూస్తోంది. ప్రతిపక్షాలకు అందకుండా తమ ప్రచారం ఉండాలని సీఎం కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి గెలిచి, హ్యాట్రిక్ విజయం సాధించాలని పట్టుదలతో కనిపిస్తోంది. అక్టోబర్ లో ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. సుడిగాలి పర్యటనలతో సీఎం కేసీఆర్ ప్రచారాన్ని చేయబోతున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో 100 సభలకు ప్లాన్ చేస్తుంది బీఆర్ఎస్. 100 నియోజకవర్గాలు కవర్ అయ్యేవిధంగా బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ ఎన్నికల వ్యూహ కమిటీ త్వరలోనే షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం కనిపొస్తోంది.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం సాగించేలా వ్యూహాలకు పదును పెడుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబందిచిన బాధ్యతలను మంత్రి కేటీఆర్‌కు, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ప్రచార బాధ్యునిగా మంత్రి హరీష్ రావును నియమిస్తారని తెలుస్తోంది. అదేవిధంగా GHMC,HMDA పరిదిలోని నియోజకవర్గ ప్రచార బాధ్యతల్ని కూడా మంత్రి కేటీఆర్‌కే ఇస్తారని సమాచారం.