Menu

  • Home
  • ఎడిటోరియల్
  • అజారుద్దీన్ మంత్రి పదవిపై ఉత్కంఠ.. అజార్ కు ఆఖరి ఓవర్ ?
azharuddin minister post mlc deadline

అజారుద్దీన్ మంత్రి పదవిపై ఉత్కంఠ.. అజార్ కు ఆఖరి ఓవర్ ?

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అజారుద్దీన్ మంత్రి పదవి చుట్టూ జరుగుతున్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం, రాష్ట్రంలో ఏ సభలోనూ సభ్యుడు కాకుండా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఆరు నెలల లోపు తప్పనిసరిగా అసెంబ్లీ లేదా మండలికి ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజారుద్దీన్ గత ఏడాది అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ గడువు ఈ నెల 30వ తేదీతో ముగుస్తోంది. ఒకవేళ ఈ గడువులోగా ఆయన ఎమ్మెల్సీగా నియమితులైనట్లు అధికారిక ప్రకటన వెలువడకపోతే, రాజ్యాంగపరంగా ఆయన తన మంత్రి పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది.

ఈ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక వెసులుబాటు ద్వారా అనుభవజ్ఞులను ప్రభుత్వంలోకి తీసుకునే క్రమంలో అజారుద్దీన్‌ను మంత్రిని చేశామని, ఇప్పుడు ఆయన పదవికి ముప్పు రాకుండా ఉండాలంటే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఫైల్‌ను వెంటనే ఆమోదించాలని సీఎం కోరారు. గత కొంతకాలంగా లోక్‌భవన్‌లో ( రాజ్ భవన్) పెండింగ్‌లో ఉన్న ఫైల్‌పై గవర్నర్ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అజారుద్దీన్‌తో పాటు ప్రొఫెసర్ కోదండరాంల భవితవ్యం ఆధారపడి ఉంది.

అజారుద్దీన్ మంత్రి పదవికి అవసరం అయిన ఎమ్మెల్సీకి గవర్నర్ ఆమోదం లభించేనా?

అయితే, గవర్నర్ కోటా నియామకాలు మొదటి నుంచీ అనేక న్యాయ, రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారాయి. గత కేసీఆర్ ప్రభుత్వం సిఫార్సు చేసిన పేర్లను గవర్నర్ తిరస్కరించడం, ఆపై ఆ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కడం వంటి పరిణామాల వల్ల ప్రస్తుత ప్రభుత్వ ప్రతిపాదనలు కూడా జాప్యం అవడానికి కారణం అని తెలుస్తుంది. మొదట ప్రభుత్వం పంపిన పేర్లలో మార్పులు చేసి, రెండోసారి అజారుద్దీన్ పేరును గవర్నర్ కోటా కింద సిఫార్సు చేశారు. ఇప్పుడు గడువు దగ్గర పడటంతో, ఒకవేళ గవర్నర్ ఈ ఫైల్‌ను ఈ నెల 30లోగా ఆమోదించకపోతే, అజారుద్దీన్ సెక్రటేరియట్ నుంచి నిష్క్రమించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. రాజీనామా చేసిన తర్వాత మళ్లీ ఆయనను ఎమ్మెల్సీగా ఎన్నిక చేసి, తిరిగి మంత్రిగా ప్రమాణం చేయించాల్సి ఉంటుంది.

Also Read..| తెలంగాణలో ప్రధాని మోడీ టూర్ ఇప్పట్లో లేనట్లేనా..?

గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి ఓడిపోయిన అజారుద్దీన్‌ను రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స ఉపఎన్నిక సందర్భంగా మైనారిటీ వర్గాల మద్దతును కాపాడుకోవడంతో పాటు, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకుడిని కేబినెట్‌లో ఉంచడం ద్వారా పార్టీకి మేలు జరుగుతుందని కాంగ్రెస్ భావించింది. కానీ, ఇప్పుడు ఎమ్మెల్సీ నియామకంపై నీలినీడలు కమ్ముకోవడంతో ముఖ్యమంత్రి వేసిన వ్యూహం ఫలిస్తుందా.. లేక అజారుద్దీన్ తన మంత్రి పదవిని వదులుకోవాల్సి వస్తుందా అన్నది తేలాల్సి ఉంది. రాబోయే పదిరోజులు అజారుద్దీన్ రాజకీయ జీవితానికి అత్యంత కీలకం కానున్నాయి అనడంలో సందేహం లేదు..

shigulla Raju, Journalist
– జర్నలిస్ట్ శిగుల్ల రాజు

Share the post