బీజేపీలోకి ఎమ్మెల్యే రాజాసింగ్ రీఎంట్రీ కి లైన్ క్లియర్ అయిందా అని అంటే.. అవుననే సమాధానమే పార్టీ వర్గాల నుండి వస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో ‘గోషామహల్’ అంటేనే ఒక సంచలనం. ఎమ్మెల్యే రాజాసింగ్ అంటేనే ఒక అగ్నిపర్వతం. గత ఎనిమిది నెలలుగా బీజేపీకి, రాజాసింగ్‌కు (MLA Raja Singh) మధ్య నడుస్తున్న ఆసక్తికరమైన ‘కోల్డ్ వార్’ ఇప్పుడు సుఖాంతం కాబోతోందా? “నచ్చక బయటికి వెళ్ళారా.. పంపించారా?” అన్న చర్చను పక్కన పెడితే, ఇప్పుడు ఆయన తిరిగి కాషాయ కండువా కప్పుకోవడానికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ వన్ సైడ్ లవ్‌గా సాగిన ఈ వ్యవహారం, ఇప్పుడు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టూ-వేగా మారబోతోందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.
రాజాసింగ్ రీఎంట్రీకి రంగం సిద్దం అయిందా…
విక్రమార్కుడి తరహాలో రాజాసింగ్ చేసిన ప్రయత్నాలు సామాన్యమైనవి కావు. ఒకవైపు రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూనే, మరోవైపు ఢిల్లీ పెద్దల వద్ద తన పట్టు నిలుపుకునేందుకు తెరవెనుక చక్రం తిప్పారు. తన రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలపై గతంలో అధిష్టానం సీరియస్ అయినప్పటికీ, రాజాసింగ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. “నేను ఎక్కడికీ వెళ్ళను.. మళ్ళీ బీజేపీలోనే ఉంటాను” అని ఆయన చెప్పిన మాటలు కేవలం గంభీర ప్రకటనలే కావని, దాని వెనుక బలమైన లాబీయింగ్ ఉందనేది ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది.
రాష్ట్ర బీజేపీ నేతల్లో కొందరు రాజాసింగ్ రాకను వ్యతిరేకించినా, అగ్ర నాయకత్వం ఆలోచన మరోలా ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్న పట్టు, పార్టీకి ఆయన అందించే దూకుడు తెలంగాణలో అవసరమని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట. తాజాగా గోషామహల్ స్థానిక నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసినప్పుడు, రాజాసింగ్ విషయంలో సానుకూల సంకేతాలు వెలువడటం ఇందుకు నిదర్శనం. “ఆయనతో సమన్వయం చేసుకోండి.. కలిసి ముందుకు సాగండి” అని కిషన్ రెడ్డి స్వయంగా సూచించినట్లు వస్తున్న వార్తలు రాజాసింగ్ రీ-ఎంట్రీని దాదాపు ఖరారు చేశాయి.
అయితే రాజాసింగ్‌కు ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ సస్పెన్షన్ వేటు పడ్డా, తిరిగి పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయనది. కానీ ఈసారి రాజీనామా చేయడం, అది తక్షణమే ఆమోదం పొందడం వంటి పరిణామాల తర్వాత మళ్ళీ పార్టీలోకి వస్తుండడం విశేషం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నియామకంపై గతంలో ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే సూత్రం ఇక్కడ మరోసారి నిరూపితం అవుతుంది.
Also Read..| తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల పందేరం ! ఆ లక్కీ లీడర్లు ఎవరు?
రాజాసింగ్ రీఎంట్రీకి ముహూర్తం మాత్రమే బాకీ ఉంది. ఆయన రాకతో హైదరాబాద్ బీజేపీలో కొత్త జోష్ వస్తుందా? లేక అంతర్గత విభేదాలు మరింత ముదురుతాయా? అన్నది తెలియాలంటే వేచి చూడాలి. ఏది ఏమైనా, ఇన్నాళ్లూ “నో ఎంట్రీ” బోర్డు పెట్టిన రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు “వెల్కమ్” బోర్డు సిద్ధం చేస్తోంది. త్వరలోనే రాజాసింగ్ మళ్ళీ కమలం గూటికి చేరి తనదైన స్టైల్‌లో రాజకీయ రణరంగంలోకి దూకడం ఖాయంగా కనిపిస్తోంది.









