మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికలు కాషాయ పార్టీలో ఆ ఇద్దరు ఎంపీలకు సవాల్ గా మారాయా..? ఆ కార్పోరేషన్ ల మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆ నాయకులు పావులు కదుపుతున్నారా..? ఆ రెండు కార్పొరేషన్ ల పరిధిలో పెద్ద ఎత్తున చేరికలు అందులో భాగంగానే జరుగుతున్నాయా..? ఆ రెండు కార్పొరేషన్ లను కైవసం చేసుకోవడం ద్వారా ఆ నేతలు పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారా..? స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పక్కా వ్యూహాలతో అడుగులు వేస్తున్నారా ? ఇంతకీ ఆ కార్పొరేషన్ లు ఏవి..? ఎవరా ఇద్దరు ఎంపీలు..?
తెలంగాణలో వరుసగా వస్తున్న ఎన్నికలు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి.. నిన్నా మొన్నటి వరకు పల్లెల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం సాగగా, ఇప్పుడు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల జాతర షురూ అయింది.. పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ప్రధాన పార్టీలన్నిఈ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి.. ఈనేపథ్యంలోనే ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలదళం సమాయత్తం అయింది. బీజేపీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.. ఈసారి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని తహతహలాడుతోంది. పార్టీకి పట్టున్న కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో మెజారిటీ మున్సిపాల్టీల్లో బీజేపీ జెండాను ఎగురవేయాలని పార్టీ సీరియస్ గా పనిచేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు తెలంగాణ కమలం పార్టీ ఇంఛార్జిగా మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెల్లార్, సహ ఇన్చార్జిలుగా అశోక్ పర్నామి, ఎంపీ రేఖాశర్మలు కీలక నేతలకు దిశా నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులతోనే పట్టణాలు, నగరాల అభివృద్ధి సాధ్యమనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ్రద్ది, సంక్షేమ పథకాలను విరివిగా ప్రచారం చేయాలని ఇంచార్జులు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు పార్టీ నయకులు, ప్రజాప్రతినిధులు ఫీల్డ్ లోనే ఉండాలని సూచించారట.
బీజేపీకి పట్టున్న కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న రెండు కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరుగుతుండటంతో.. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ లకు పెద్ద సవాల్ గా మారిందట. ఈ ఇద్దరు నాయకులు దూకుడు స్వభావం ఉన్నవారు కావడం వల్ల.. అక్కడ బీజేపీకి అనుకూల వాతావరణం ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, రామగుండం, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, నల్లగొండ జిల్లాల్లో కూడా విజయావకాశాలున్నాయని పార్టీ అధినాయకత్వం భావిస్తుందట.
Also Read..| 2026 మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ బీజేపీకి అగ్నిపరీక్షేనా ?
ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్ రెండు కార్పొరేషన్లను మాత్రం ఇద్దరు కీలక నాయకులకు ఛాలెంజ్ గా మారాయని ప్రచారం జరుగుతోంది. అక్కడ గెలుపు బాధ్యతలను బండి సంజయ్, అర్వింద్ లు తమ భుజాలపై వేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ప్రధానంగా తమ పరిధిలో ఉన్న రెండు కార్పొరేషన్ లలో కాషాయ జెండా ఎగుర వేసేందుకు ఈ ఇద్దరు నాయకులు తమ వ్యూహాలకు పదును పెడుతూ.. ముందుకు వెళ్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కరీంనగర్ కార్పొరేషన్ లో ఉన్న 66 డివిజన్లలో గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో కేంద్రమంత్రి బండి సంజయ్ పనిచేస్తున్నారట. నిజామాబాద్ లో 60 డివిజన్లకు గాను గతంలో జరిగిన ఎన్నికల్లో 28 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ, సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాత్రం ఈసారి మేయర్ పీఠం బీజేపీ గెలుచుకునేవిదంగా పావులు కదుపుతున్నారట. ఈ రెండు కార్పొరేషన్ లలో కాషాయజెండా ఎగురువేయడమే లక్ష్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ లు ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాదు, పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటూ ప్రచారంలో దూకుడుగా వెళ్తూ ప్రత్యర్థి పార్టీల అంచనాలకు మించి ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తున్నారట.
ఉత్తర తెలంగాణలో పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లో ఉన్న ఈ రెండు కార్పొరేషన్లలో మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడం ద్వారా.. తమ పట్టు నిలుపుకోవాలని ఒకవైపు బండి సంజయ్, మరోవైపు ధర్మపురి అర్వింద్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. హిందుత్వ ఫైర్ బ్రాండ్ గా ఇమేజ్ ఉన్న బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా రెండు సార్లు గెలవడం, ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిలో ఉండటంతో.. ఆయన ఈ కార్పోరేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టారట. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 12 స్థానాలు గెలవడం, బీఆర్ఎస్ 34, ఎంఐఎం 12, కాంగ్రెస్ 2 లతో బీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకుంది. ఈసారి మేయర్ పీఠమే లక్ష్యంగా బండి సంజయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నరట. రూ. 479 కోట్ల స్మార్ట్ సిటీ పథకం నిధులను ఈ సంవత్సరం కేంద్రప్రభుత్వం ద్వారా అందిన విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారట. ఒకవేళ కరీంనగర్ కార్పోరేషన్ ను కమలం పార్టీ గెలవకపోతే బండి సంజయ్ నాయకత్వంపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనే చర్చకూడా రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
ఇక నిజామాబాద్ కార్పొరేషన్ విషయానికి వస్తే.. బీజేపీకి అందని ద్రాక్షలాగా మేయర్ పీఠం గతంలో తృటిలో చేజారింది. 60 డివిజన్లలో బీజేపీ 28, బీఆర్ఎస్ 12, ఎంఐఎం 17 కాంగ్రెస్ 2 గెలవగా, బీజేపీకి మేయర్ పదవి దక్కకుండా గులాబీపార్టీ, ఎంఐఎం పొత్తుతో మేయర్ , డిప్యూటీ మేయర్ లను బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు పంచుకున్నాయి. అయితే, ఈసారి మాత్రం ఎలాగైనా మేయర్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా.. “మన ఇందూర్, మన మేయర్” అంటూ వాల్ పోస్టర్లు వేస్తూ ప్రచారంలో కమలదళం దూసుకెపోతోంది. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలవడం, ఇక్కడి ప్రజల చిరకాలవాంఛ పసుపు బోర్డు ఏర్పాటును సాధించడం పార్టీకి కలసివస్తాయని లెక్కలు వేస్తున్నారట. అంతేకాదు, ఈ కార్పోరేషన్ పరిదిలోనే తమ పార్టీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నయోజకవర్గం ఉండడంతో ఇద్దరు కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవలని కలిసి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ నిజామాబాద్ మేయర్ పీఠం చేజారితే.. వచ్చే ఎన్నికల్లో వ్యక్తిగతంగా ఇటు ఎంపీ అర్వింద్ కు, అటు పార్టీకి కూడా గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలను బీజేపీ పాజిటివ్ గా తీసుకుంది. గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించామని పార్టీ నాయకత్వం జోష్ లో ఉంది. మరి ఈసారి జరిగే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని పార్టీ నాయకత్వం గంపెడాశతో ఎదురుచూస్తుందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ ఇద్దరు ఎంపీలు మేయర్ పీఠాలను కైవసం చేసుకుంటారా..? లేదా.. అనే ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది.









