మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ బీజేపీకి మరో కీలక పరీక్షగా మారాయా…? రాష్ట్ర రాజకీయాల్లో తామే ప్రత్యామ్నాయమని కమలం పార్టీ చాలా కాలంగా చెబుతూ వస్తోంది. కానీ ఆ మాటలకు తగ్గట్టు చేతలు కనిపిస్తున్నాయా..? పట్టణ ప్రాంతాల్లో తమదే బలమైన పార్టీ అని చెప్పుకునే బీజేపీ, మున్సిపల్ ఎన్నికల్లో తన సత్తాను నిరూపించుకుంటుందా..?
“నెక్స్ట్ మేమే” అంటూ ప్రతి ఎన్నికకు ముందు ధీమాగా మాట్లాడే బీజేపీ, ఎన్నికలు సమీపించగానే వ్యూహాత్మకంగా వెనకడుగు వేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. జాతీయ నాయకత్వ బలం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఉన్న ప్రయోజనంతో లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపగలుగుతున్నప్పటికీ… రాష్ట్ర నాయకత్వం ప్రధానంగా వ్యవహరించే ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోతుంది. “సీట్లు తక్కువైనా ఓట్ల శాతం పెరుగుతోంది” అని బీజేపీ నేతలు ప్రతిసారి సమర్ధించుకుంటున్నా.. అధికార లక్ష్యంతో రాజకీయాలు చేసే పార్టీకి ఇది సరిపోతుందా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
గతంలో తెలంగాణ బీజేపీ పోటీచేసిన స్థానాలు ఎన్ని?
2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి పెద్దగా అనుకూలంగా లేవన్నది వాస్తవం. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాయి. బీజేపీ కేవలం రెండు మున్సిపాలిటీలకే పరిమితమైంది. అవీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని మక్తల్, ఆమనగల్. వార్డుల స్థాయిలో చూస్తే పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం 2,727 వార్డులు ఉంటే, బీజేపీ పోటీ చేసినవి 2,026 మాత్రమే. వాటిలో గెలిచినవి కేవలం 237. అంటే దాదాపు 700 వార్డుల్లో అభ్యర్థులే లేరని స్పష్టం అయింది.
గత మున్సిపల్ కార్పొరేషన్లలోనూ కమలం పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. 10 కార్పొరేషన్లలో ఉన్న 385 డివిజన్లలో బీజేపీ 344 చోట్ల పోటీ చేసి కేవలం 78 డివిజన్లలో మాత్రమే విజయం సాధించింది. “అర్బన్ పార్టీ”గా చెప్పుకునే బీజేపీ అన్ని డివిజన్లలో అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోవడం అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అంతేకాదు, 48 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో ఒక్క సీటు కూడా దక్కలేదు. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో మాత్రమే బీజేపీ కొంత ప్రభావం చూపగలిగింది.
ఈసారైనా అన్ని స్థానాల్లో తెలంగాణ బీజేపీ పోటీ చేసేనా ?
ఇప్పుడు, రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2,996 వార్డులు ఉన్నాయి. గత అనుభవాలను పక్కనపెట్టినా, ఈసారి అయినా అన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను నిలబెట్టగలదా అన్న సందేహం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. సమయం తక్కువగా ఉండటం, పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లోనే కీలక నేతలు చురుకుగా కనిపించడం, మిగతా ప్రాంతాల్లో క్యాడర్ బలహీనంగా ఉండటం వంటి అంశాలు పార్టీకి సవాలుగా మారాయి.
పార్టీ వర్గాలే వంద శాతం సీట్లలో పోటీ చేయడం కష్టమేనని, కనీసం 90–95 శాతం సీట్లలో అభ్యర్థులను నిలబెట్టగలిగితేనే అది విజయంగా భావించాల్సిన పరిస్థితి ఉందని పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారట. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో సుమారు 50 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉండటంతో, అక్కడైనా పార్టీ ప్రభావం ఎలా ఉంటుందనేది రాష్ట్ర నాయకత్వానికి కీలకంగా మారింది.
Also Read..| విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం
పట్టణాల్లో తమకే పట్టు ఉందని బీజేపీ నేతలు ఘనంగా చెప్పుకుంటున్న ఈ సమయంలో, ఈ మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ కాషాయ దళానికి నిజమైన అగ్నిపరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో స్పష్టమైన ఫలితాలు సాధించి తమ సత్తాను నిరూపించుకుంటేనే క్యాడర్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లేకపోతే, మాటల స్థాయిలోనే ప్రత్యామ్నాయ శక్తినని చెప్పుకుంటూ, ఆచరణలో విఫలమైతే… దాని ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకూ కొనసాగుతుందన్నది రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.









