తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల నియామకాలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే వైస్ ప్రెసిడెంట్లు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, జనరల్ సెక్రటరీల నుంచి ఇటీవల డీసీసీ అధ్యక్షుల వరకు అనేక పోస్టులను ఏఐసీసీ భర్తీ చేసింది. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు మాత్రమే మిగిలాయి. ఈ పోస్టుల కోసం పార్టీలో పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. కీలక నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నియామకాలను చాలా కాలం పాటు నిలిపివేశారు. అయితే, ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ త్వరలోనే ఈ పదవుల భర్తీ ఉంటుందని స్పష్టం చేయడంతో పదవులకు సంబందించి గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ కాంగ్రెస్ లో ఆ పోస్టులకు ఎందుకంత పోటీ?
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని చాలామంది నేతలు ఆశిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. గతంలో ఈ పదవిలో పనిచేసిన అనేకమంది నాయకులు ఇప్పుడు అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. వారిలో.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వంటి వారు గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పని చేసినవారే. అంటే, ఈ పోస్టును పార్టీ భవిష్యత్ శిక్షణా వేదికగా భావిస్తున్నారు. ఈ ప్రాధాన్యతనే ఇప్పుడు ఈ పోస్టుకు విపరీతమైన డిమాండ్‌ను పెంచింది.
ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్‌ల నియామకంలో సామాజిక సమీకరణాలు పాటించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం ఐదు ప్రధాన సామాజిక వర్గాలు – ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇలా ఒక అవకాశం కల్పించాలని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒక్కో వర్గానికి ఒకే ఒక్క పదవి ఉండడంతో ఆ ఒక్క సీటు కోసం ఆయా వర్గానికి చెందిన పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. తమ వర్గానికి కేటాయించిన పదవిని దక్కించుకోవడానికి నాయకులు ఇప్పటికే తీవ్రంగా లాబీయింగ్ మొదలుపెట్టారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో ఉన్న కీలక నేతలు..?
సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితులైన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రోహిన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వంటి కీలక నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. బీసీ సామాజిక వర్గం నుండి టీజీఎండీసీ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుండి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లాబీయింగ్ చేస్తున్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుండిఇ పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నించి విఫలమైన ఎంపీ బలరాం నాయక్ కూడా ఈ పోస్టు దక్కించుకోవాలని పట్టుపడుతున్నారు. మైనారిటీ వర్గం నుండి ఫిరోజ్ ఖాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, మాజీ డీసీసీ అధ్యక్షుడు జావిద్ ఈ రేసులో ఉన్నారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
Also Read..| వాట్సప్ పై రష్యాలో నిషేదం..?
పదవుల భర్తీ విషయంలో ఒకవైపు సామాజిక సమతుల్యతను పాటించాలనే పార్టీ ఆలోచన, మరోవైపు నాయకుల లాబీయింగ్ ఈ నియామకాల ప్రక్రియ ఆలస్యం అవుతుందనే వార్తలు వినబడుతున్నాయి. కొందరు నేతలు తమకు దక్కిన పదవులను కూడా నిరాకరించి, కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసమే పట్టుబడుతున్నారట. ఇలాంటి తరుణంలో పార్టీ అధిష్ఠానం ఈ భర్తీని ఎలా పూర్తి చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌తో పాటు ఏఐసీసీ నేతలు కలిసి తీసుకునే తుది నిర్ణయంపైనే ఎవరెవరికి ఈ కీలక పదవులు దక్కుతాయో తెలుస్తుంది. మొత్తం మీద, తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ల ఎంపిక ప్రక్రియ ఉత్కంఠభరితంగా మారిందనే విషయం మాత్రం స్పష్టంగా కనబడుతోంది.









