తెలంగాణ మంత్రులు కొండా సురేఖ పొంగులేటిల మద్య వివాదం సద్దుమనిగిట్టేనా అనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వంలో కొండా సురేఖ, పొంగులేటిల మధ్య నెలకొన్న వివాదం రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది . దీనికి ప్రధాన కారణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికార పరిధిలోని మేడారం జాతర కాంట్రాక్టుల్లో వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి తలదూర్చారనే ఆరోపణ వెల్లువెత్తింది. ఇది కేవలం శాఖాపరమైన గొడవగా మొదలైనా.. సురేఖ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసే స్థాయికి చేరడం, ఆ వెంటనే ఆమె ఓఎస్డీపై ఆరోపణలు రావడం, అతడిని తొలగించడం చకచకా జరిగిపోయాయి. ఇదంతా తనను టార్గెట్ చేసే కుట్రలో భాగంగానే అని మంత్రి సురేఖ వర్గం గట్టిగా నమ్ముతోంది.
ఈ మొత్తం వ్యవహారంలో కీలక మలుపు మంత్రి సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఎంట్రీ. తన తల్లిని అణిచివేసేందుకు పార్టీలోని పెద్దలు, ముఖ్యమంత్రి సన్నిహితులు కుట్ర చేస్తున్నారని ఆమె ఏకంగా మీడియా ముందు ఆరోపించడం సంచలనంగా మారంది. ఒక క్యాబినెట్ మంత్రి నివాసానికి అర్థరాత్రి పోలీసులు రావడం, మఫ్టీలో హడావుడి చేయడంపై ఆమె నిలదీయడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా, బీసీ వర్గానికి చెందిన మహిళా మంత్రిని పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో సామాజిక న్యాయం అంశంగా మార్చివేశాయి. ప్రభుత్వంలో బీసీ వర్సెస్ రెడ్డి లాగా వివాదం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఒక్క కామెంట్‌తో అధికార పార్టీ ఆత్మరక్షణలో పడింది.
పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్ఠానం వెంటనే రంగంలోకి దిగింది. నిన్న జరిగిన ముఖ్యమైన కేబినెట్ భేటీని సైతం పక్కన పెట్టి, కొండా సురేఖ తన కుమార్తె సుస్మితతో కలిసి ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చలో, సురేఖ తన బాధను, జరుగుతున్న పరిణామాలను పూసగుచ్చినట్లుగా వివరించారు. తనపై, తన కుటుంబంపై జరుగుతున్న కుట్రలను, ముఖ్యంగా పొంగులేటి జోక్యాన్ని ఆమె అధిష్ఠానం ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది.
అధిష్ఠానం ప్రతినిధులు ఈ సమస్యను చాలా సున్నితమైన అంశంగా పరిగణించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు, బీసీ రిజర్వేషన్ల అంశం వంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, బీసీ వర్గానికి చెందిన మంత్రిపై ఏకపక్ష చర్యలు తీసుకోవద్దని అధిష్టానం రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం. సురేఖతో మాట్లాడి, వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని మీనాక్షి నటరాజన్‌కు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు, సురేఖను టార్గెట్ చేస్తూ మంత్రులు వ్యవహరించిన తీరుపై కూడా అధిష్ఠానం అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొందరు మంత్రుల ప్రవర్తన ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపాయని అధిష్ఠానం కూడా అభిప్రాయపడినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మొత్తానికి, సుస్మితా పటేల్ చేసిన ఆరోపణలు, ప్రత్యేకించి “బీసీలపై వివక్ష” అనే అంశం ఈ మొత్తం వ్యవహారాన్ని మలుపు తిప్పిందనడంలో సందేహం లేదు. ఆమె ఆవేశపూరిత వ్యాఖ్యలు పార్టీని ఇరుకున పెట్టినా, ఒక రకంగా సురేఖ మంత్రి పదవిని కాపాడుకోవడానికి ఉపయోగపడ్డాయని చర్చ జరుగుతోంది. ఈ భేటీ తర్వాత, పార్టీ పెద్దలు సమస్యను పరిష్కరిస్తారని, వారి నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని మంత్రి సురేఖ ప్రకటించారు.
మరోవైపు మంత్రి పొంగులేటి కూడా ఈ అంశంపై స్పందించారు. ఈ అంశాన్ని కొందరు సముద్రంలో తుఫానులాగా స్రుష్టించారు.. కానీ ఇది టీకప్పులో తుఫాను లాంటిదేనని వ్యాఖ్యానించారు. త్వరలోనే అన్నీ సద్దుమనుగుతాయిని పొంగులేటి అన్నారు.
మొత్తానికి మంత్రుల కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ల మద్య జరుగుతున్న ఈ వివాదం అధిష్టానం జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగినట్లుగా కనిపిస్తున్నా.. ఈ వివాదానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందోనని అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో పలువురు చర్చించుకుంటున్నారు.









