తెలంగాణ పీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బిజెపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ లకు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. టిఎస్పిఎస్సి పేపర్ లీక్ అంశంపై అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుదామని ఆమె ప్రతిపాదించారు. ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ప్రగతి భవన్ మార్చ్ కు పిలుపునిద్దామని సూచించారు. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్ష పార్టీలను తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బ్రతకనివ్వరని షర్మిల అన్నారు. ఈ సమయంలో ప్రతిపక్షాలు ఏకం కావలసిన అవసరం ఉందని ఆమె వివరించారు. షర్మిల ప్రతిపాదనలకు బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు. దీనిపై త్వరలోనే సమావేశం అవుదామని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీంతో రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చిన తరువాత ఉమ్మడిగా కార్యాచరణ దిశగా అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటీవల కొన్ని రోజుల క్రితం ఈ విధంగానే షర్మిల రెండు పార్టీలకు లేఖలు రాశారు. ప్రభుత్వంపై పోరాటం చేద్దామని కానీ అప్పుడు స్పందించలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం విషయంలో సానుకూలంగా స్పందించారని సమాచారం. ఇటీవల తెలంగాణ టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన షర్మిలను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. గతంలో నిరుద్యోగుల పక్షాన ప్రతి మంగళవారం వైఎస్ షర్మిల దీక్షలు కూడా చేశారు. ఇప్పుడు షర్మిల ప్రతిపాదించిన విధంగా బిజెపి కాంగ్రెస్ పార్టీలు కలిసి వస్తాయా.. ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకుని ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేస్తారా.. అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.