మూడు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్టకేలకు లోక్ సభలో ఆమోదం పొందింది. చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ బిల్లును తీసుకువచ్చారు. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ 2023 సెప్టెంబర్ 19వ తేదీ మంగళవారం రోజున లోక్ సభలో ప్రవేశపెట్టారు. 20వ తేదీ బుధవారం రోజున సుధీర్ఘంగా 8 గంటల పాటు చర్చించిన అనంతరం బిల్లుకు ఆమోదం తెలిపారు. చారిత్రాత్మకమైన ఈ బిల్లుకు ఓటింగ్ నిర్వహంచారు. అనుకూలంగా 454 మంది ఎంపీలు ఓటు వేయగా.. ఇద్దరు ఎంఐఎం ఎంపీలు బిల్లుకు వ్యతిరేఖంగా ఓటు వేశారు. దీంతో చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం లభించింది.
కొత్త పార్లమెంటు భవనంలో మొదటి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. రాజ్య సభలో ఆమోదం పొందగానే బిల్లు చట్టరూపం దాల్చుతుంది. అయితే, డీలిమిటేషన్ ప్రక్రియ, జనాభా లెక్కల తర్వాతే మహిళా బిల్లు అమలులోకి రానుంది. 2024 పార్లమొంటు ఎన్నికల్లో ఈ చట్టం అమలు కాదు. 2029 ఎన్నికల నుండి మహిళల రిజర్వేషన్ బిల్లు అమలులోకి రానుంది.