రోజురోజుకు పెరుగుతున్న టమాటా ధరలు సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. అంతే కాకుండా కాపురాలు కూడా కూలుస్తున్నాయి. ఓ వ్యక్తి తన భార్యకు తెలియకుండా వంటలో రెండు టమాటాలు వినియోగించాడు. దీంతో భర్తపై మండిపడ్డ ఆ భార్య తన పిల్లలతో సహా ఇంట్లోంచి వెళ్లిపోయింది. మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో సంజీవ్ బర్మన్ అనే వ్యక్తి ఓ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. అతడు తన భార్యకు చెప్పకుండా వంటలో రెండు టమాటాలను వినియోగించాడు. విషయం తెలిసిన భార్య అతడిపై నోరు పారేసుకుంది. మాటా మాటా పెరిగి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఆమె తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తన భార్య కోసం చుట్టుపక్కల వెతికినా జాడ తెలియలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించాడు సంజీవ్ బర్మన్.