Thursday, April 17, 2025
HomeNewsTelanganaబొగ్గు గనుల వేలంతో రాష్ట్రానికే లాభం.. సింగరేణి విషయంలో రాజకీయాలొద్దు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బొగ్గు గనుల వేలంతో రాష్ట్రానికే లాభం.. సింగరేణి విషయంలో రాజకీయాలొద్దు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

రానున్న రోజుల్లో దేశ అవసరాలకు తగ్గట్లుగా బొగ్గు ఉత్పత్తిని పెంచుతూ.. ఈ రంగంలో ఆత్మనిర్భరతకోసం కృషిచేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బొగ్గుపై ఆధారపడిన విద్యుదుత్పత్తి, సిమెంట్ తయారీతోపాటుగా ఇతర పరిశ్రమలకు బొగ్గు కొరత రాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన 10వ విడత కమర్షియల్ మైనింగ్ వేలం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. బొగ్గు రంగంలో అత్యాధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులను అవలంబించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

కోల్ గ్యాసిఫికేషన్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. బొగ్గుద్వారా జరుగుతున్న విద్యుదుత్పత్తిని మరింత పెంచే దిశగా కోల్ గ్యాసిఫికేషన్ ఓ విప్లవాత్మకమైన సంస్కరణ కానుందన్నారు. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల కోల్ గ్యాసిఫికేషన్ టార్గెట్ గా పనిచేస్తామన్నారు.

ప్రధాని నరేంద్రమోడీ ఆలోచనలకు అనుగుణంగా.. చక్కటి ఫలితాలను సాధించేందుకు 100 రోజుల ప్రణాళిక, వచ్చే ఐదేళ్ల కోసం ప్రణాళిక రూపొందించుకుని పని ప్రారంభించామని అన్నారు.

తెలంగాణలోని సింగరేణి విషయంలో రాజకీయాలకు చోటు లేదని.. ఈ విషయంలో అనవసరంగా రాజకీయాలు చేయొద్దని విపక్ష పార్టీలకు సూచించారు. కోల్ ఇండియాకు ఇచ్చిన ప్రాధాన్యతనే.. సింగరేణికి కూడా కేంద్రం ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో సింగరేణిని కేంద్రం ఆదుకునే విధంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు.

రెండు గనుల విషయంపై కేంద్రం దృష్టి సారించిందని.. ఒడిశాలోని నైని ప్రాజెక్టుపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. బొగ్గు గనుల విషయంలో దేశవ్యాప్తంగా ఒకే పాలసీని కేంద్రం అమలుచేస్తోందన్నారు. ఈ విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా పనిచేస్తామన్నారు. సింగరేణిలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని అధిగమించి.. సింగరేణి అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. గనుల వేలం అనేది.. ఓ బహిరంగ ప్రక్రియ అని ఇందులో ఎవరైనా పాల్గొన వచ్చన్నారు.

సింగరేణి విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గత పదేళ్లలో బొగ్గురంగంలో సాధించిన ప్రగతిని, భవిష్యత్తుకోసం పెట్టుకున్న లక్ష్యాలను ఆయన వివరించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments