బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఛలో బాట సింగారం కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ముందస్తుగా తెల్లవారుఝాము నుంచే బీజేపీ నేతలను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు పోలీసులు. బాట సింగారంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించకుండా ముందుగానే అదుపులోకి తీసుకున్నారు.
ఉదయం నుండే పోలీసులు బేజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. శంషాబాద్ వద్ద కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వర్షంలోనే రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆయనతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు కూడా ఉన్నారు. బాట సింగారానికి నేతలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవటంపై కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాటసింగారంకు బయలుదేరిన కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేశారు. కిషన్ రెడ్డి అరెస్ట్ తో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉదయం ఢిల్లీ నుంచి నగరానికి వచ్చిన కిషన్‌రెడ్డి, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి బాటసింగారంకు బయలుదేరారు. అయితే, పోలీసులు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఎయిర్‌పోర్టు పరిధి దాటగానే వాహనాలను అడ్డుపెట్టి మరీ కిషన్ రెడ్డి కాన్వాయ్ ని పోలీసులు ఆపేశారు. దీంతో, కిషన్ రెడ్డి, రఘునందనరావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే, అది అధికారిక కార్యక్రమం కాదు కాబట్టి కేంద్రమంత్రిని అడ్డుకున్నామని పోలీసులు చెప్నారు. పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు, నాయకులు భగ్గుమంటున్నారు. బలవంతంగా కిషన్‌రెడ్డి, రఘునందన్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి, అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో చాలాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.