సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలనే డిమాండ్ తో వారు లక్డీకపూల్ లోని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఆఫీసును ముందు ఆందోళన నిర్యహించారు. తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భారీ ఆందోళణ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించాలని, క్రమబద్దీకరించే వరకు కనీస పేస్కేల్ ను అమలు చేయాలని, ప్రతీ ఉద్యోగికి జీవిత భీమా 10 లక్షలు, ఆరోగ్య భీమా 5 లక్షల సౌకర్యం కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో వారు నిరసన చేపట్టారు.
చేతిలో ప్లకార్డులు పట్టుకొని ఆఫీసు ముందు బైఠాయించారు. విద్యాశాఖలో తాము కీలకంగా ఉంటూ రాష్ట్రంలో విధ్యాభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నామని తెలిపారు. తమకు అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికినీ.. ఉద్యోగ భద్రత కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ ఉద్యోగులతో పాటు నిరసనలో పాల్గొని, వారికి మద్దతు తెలిపారు. వారిని పోసీసులు అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు ఉద్యోగులకు తీవ్ర తోపులాట జరిగింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు చాలాసేపు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
వీరిలో, కాంట్రాక్టుతో పాటు ఇతర హోదాలలో పనిచేస్తున్న 21 వేల మంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తాము గత 15 ఏండ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా… ఉద్యోగ భద్రత కరువైందని అంటున్నారు. కనీస వేతనం కూడా తమకు అందడం లేదని, కష్టానికి తగిన ఫలితం దక్కకపోగా.. ఉద్యోగ భద్రత కూడా లేకపోవడంతో తాము అనేక కష్టాలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. జిల్లాల నుండి భారీగా ఉద్యోగులు ఎస్పీడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ పోలీసులకి, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వారిని నివారించే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగింది. చాలా సేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అక్కడికి రావడంతో పోలీసులు వారిని చాలా సేపు కంట్రోల్ చేయలేక పోయారు.
ఒడిషా, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారని.. తెలంగాణలో కూడా రెగ్యులరైజ్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమను వెంటనే క్రమబద్ధీకరించి, కనీస పేస్కేలును అమలు చేయాలన్నారు. వీటితో పాటు ఆరోగ్య భీమా, ప్రమాద భీమా సౌకర్యాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. 21 వేల మంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారేనని అన్నారు. తమ ఆర్థిక, సామాజిక పరమైన స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తమను క్రమబద్ధీకరించాలని కోరారు.