సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య సవాల్‌గా మారింది. భాగ్యనగరం ఎంతగా అభివృద్ధి చెందినా.. ట్రాఫిక్ సమస్య నుంచి మాత్రం తప్పించుకోలేకపోతోంది. గత ప్రభుత్వం యూటర్న్, ఫ్రీ లెప్ట్ విధానాన్ని తీసుకువచ్చినా.. చాలా ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు అందుబాటులోకి తెచ్చినా.. మెట్రో సదుపాయం కల్పించినా ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తీరడం లేదు. రోజురోజుకు విపరీతంగా వాహనాల సంఖ్య పెరిగిపోవడం, మెజారిటీ ప్రజలు ప్రజా రవాణకు దూరంగా ఉండటమే కారణమంటున్నారు విశ్లేషకులు. గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టకపోతే మరో ఢిల్లీ, బెంగుళూరు నగరాల జాబితాలో హైదరాబాద్ చేరే ప్రమాదం ఉందని పలువురు మేథవులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్‌లో నిత్యం లక్షలాది వాహనాలు రోడ్కెక్కుతున్నాయి. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. 2014 లో 71 లక్షలున్న వాహనాల సంఖ్య 125 శాతం పెరిగి ఇప్పుడు కోటి 64 లక్షలకు చేరుకుంది. కోటి మందికి పైగా జనాభా ఉన్న సిటీలో.. ప్రతీరోజు 77 లక్షలకు పైగా వాహనాలు రోడ్డు మీదకు వస్తుండగా.. 2 వేల 3 వందలకు పైగా కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఇక ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు గతంలో తీసుకొచ్చిన యూటర్న్‌లు మరో రెడ్ సిగ్నల్‌గా మారుతున్నాయి. ఫ్రీ లెఫ్ట్‌లు అన్నీ చోట్ల సక్సెస్ కావడం లేదు. దీని వల్ల రోడ్డు దాటే జనం ఇబ్బందులు పడుతున్నారన్న విమర్శలున్నాయి. ట్రాఫిక్ జామ్ పరిష్కారం కోసం GHMC, పోలీసులు పలు మార్లు రివ్యూ చేసినా ఫలితం లేదని.. ఇప్పటి వరకు ఎలాంటి కొత్త విధానాలను అధికారులు తీసుకురాలేకపోయారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ప్రజలను ఎక్కువ శాతం ప్రజా రవాణా వైపు మళ్లించడం ద్వారా ట్రాఫిక్ జాం సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సులను పెంచి.. సామాన్యులకు అందుబాటులో ఉండేలా టికెట్ ధరలు ఉంటే.. మధ్య తరగతి ప్రజలు బస్సుల వైపే మొగ్గు చూపుతారని సూచిస్తున్నారు. అలాగే ప్రజా రవాణా వ్యవస్థను ఒక్క దగ్గరకు తీసుకువచ్చి ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్‌లకు కలిపి ఒకే పాస్‌ను తీసుకురావాలని ట్రాన్స్‌పోర్ట్ రిసెర్చ్ చెబుతోంది. హైదరాబాద్‌లో ప్రయాణమంటే నరకం కాదు ఆహ్లాదకరమనే పరిస్థితులను ప్రభుత్వం తీసుకురావాలని ఇటు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రవాణా వ్యవస్థ మెరుగు పడితే అభివృద్ధి దానికంతట అదే దారిలో పడుతుందని ఆర్థిక రంగ విశ్లేషకులు అంటున్నారు. చెరువుల ఆక్రణమనలు, స్కిల్ యూనివర్శిటీ, కొత్త పాలసీలు అంటూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాఫిక్ జామ్ పరిష్కారం కోసం కూడా కొత్త ప్రణాళికలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని నొక్కి మరీ చెబుతున్నారు.
మరి హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమంటున్న రేవంత్ సర్కార్.. ట్రాఫిక్ సమస్యపై ఫోకస్ పెట్టి, ప్రణాళికాబద్దంగా ట్రాఫిక్ రహిత నగరంగా మన విశ్వనగరాన్ని మరింత అభివృద్ధి చేయాలని సగటు నగర పౌరుడు ఆకాంక్షిస్తున్నాడు.