Tuesday, April 22, 2025
HomeNewsTelanganaTelangana BJP: తెలంగాణ బీజేపీ ధర్నా.. మూసీ పరీవాహక ఇళ్ల కూల్చివేతలపై నేతల ఫైర్

Telangana BJP: తెలంగాణ బీజేపీ ధర్నా.. మూసీ పరీవాహక ఇళ్ల కూల్చివేతలపై నేతల ఫైర్

తెలంగాణ బీజేపీ నేతలు ఇందిరా పార్క వద్ద ధర్నా నిర్వహించారు. మూసీ బాధితులకు అండగా తమ పార్టీ అండగా ఉంటుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వం మూసీ నదీ పరీవాహక ప్రాంతాల్లో చేస్తున్న కూల్చివేతలకు నిరసనగా మహా ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్​ పార్టీ రేవంత్​ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తి కావస్తుంని అన్నారు. ఇంతవరకూ ఏ ఒక్క ఇంటికి భూమిపూజ గానీ, శంకుస్థాపన గానీ చేయలేదని అన్నారు. అనేక సంవత్సరాల నుంచి ఉన్న ఇళ్లను ఏ రకంగా కూలుస్తారని.. మూసీ పరివాహక ప్రాంత చరిత్ర సీఎం రేవంత్​ రెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. సోనియా గాంధీ, రాహుల్​ గాంధీల నాయకత్వంలో ఒక్క పేద వారి ఇంటికి శంకుస్థాపన చేయకపోగా.. తమ రక్తాన్ని చెమటగా మార్చి ఇటుకమీద ఇటుక పేర్చి నిర్మాణం చేసుకున్న పేదల గూళ్లను కూల్చి వేస్తున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ పరీవాహక ప్రాంతానికి వెళితే వారి కష్టాలు విని కడుపు తరుక్కుపోతుందని కిషన్ రెడ్డి అన్నారు.

మూసీ బాధితులకు బీజేపీ అండ

పేద ప్రజలు కష్టపడి, పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇండ్లను కూల్చివేస్తుంటే ఏం చేయాలో తెలియని స్థితిలో ప్రజలు ఉన్నారని అన్నారు.గత రెండు నెలలుగా ఆ ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కడుపు నిండా తిండి కూడా తినలేని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. వారందరికీ తెలంగాణ బీజేపీ నేతలు అందరూ అండగా నిలవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. దేశంలో, రాష్​ర్టంలో పేదవాడికి ఇబ్బంది వస్తే, మోదీ ఆదేశాలతో తాము అందరం అండగా నిలబడతామని మంత్రి కిషన్​ రెడ్డి హామీ ఇచ్చారు.

గ్యారంటీలతో పేరుతో మోసం

తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదవారికి ఇండ్లు కట్టిస్తామని, మహిళలకు రూ. 2500, రైతులకు రుణమాఫి, రైతు కూలీలకు 12వేలు, ఆసరా పెన్షన్​ లు పెంచుతామని, నిరుద్యోగులకు భృతి అని, రైతులకు సబ్సిడీ లాంటి అనేక రకాల హామీలను ఇస్తామని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ​, సీఎం రేవంత్​ రెడ్డిలు ప్రజలను మభ్యపెట్టి గ్యారంటీలను గారడీలుగా మార్చి మసిబూసి మారేడు కాయ చేస్తున్నారని తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం కూడా గత బీఆర్​ఎస్ సర్కార్ నడిచిన​ బాటలోనే నడుస్తోందన్నారు. పథకాలు అమలు చేయకుండా మాటలకే పరిమితం అయ్యారని మండిపడ్డారు. అయితే బీజేపీ మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు వ్యతిరేకం కాదన్నారు. కానీ పేద ప్రజల ఇండ్ల జోలికి వస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని, ఖచ్చితంగా అడ్డుకుంటుందని అన్నారు. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్​ చేశారు. మూసీకి రెండు వైపులా రిటైనింగ్​ వాల్​ నిర్మాణం చేపట్టి సుందరీకరణ చేపట్టాలని కిషన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. మూసీలో అనేక ప్రాంతాల నుంచి డ్రైనేజీ నీరు కలుస్తుందని అన్నారు. కుత్బుల్లాపూర్​, బాలానగర్​, మల్కాజ్​ గిరి ఇలా అనేక ప్రాంతాల నుంచి మూసీలో నీరు కలుస్తుందన్నారు. దాన్ని డైవర్ట్​ చేయకుండా, ఎస్ టీపీలు నిర్మాణం చేయకుండా మూసీ ప్రక్షాళన చేయలేరని అన్నారు.

హైదరాబాద్​ లో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కిషన్ రెడ్డి అన్నారు. ముందుగా పేద ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించి ఆ తరువాత మూసీ సుందరీ కరణ చేపట్టాలని డిమాండ్​ చేశారు. జీహెచ్​ఎంసీ(GHMC)కి రూపాయి రాల్చే దిక్కు దివాణం లేదు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి లైట్లు సరిచేసే దిక్కు లేదన్నారు. ఆ కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారని అన్నారు. మూసి ప్రాంతంలో బస్సు డిపో, మెట్రో కార్యాలయాన్ని ఏ విధంగా చేశారని ఆయన ప్రశ్నించారు. నగరంలో అనేక ప్రాంతాలలో ఈ సమస్య ఉందన్నారు. పెద్ద పెద్ద వ్యాపారులు రియల్ ఎస్టేట్​ విల్లాలు కడుతున్నారని, ఫాంహౌస్​ లు కట్టుకుంటే వాటి గురించే కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడటం లేదని ఆరోపించారు. రెక్కాడితేగానీ డొక్కాడని మూసీ ప్రాంత వాసుల మీద కాంగ్రెస్​ ప్రతాపం ఎందుకని నిలదీశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments