తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) తెలంగాణలో పూర్వవైభవం సాధించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తలకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ నేతలతో ఆయన ఆదివారం సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ (NTR) పెట్టిన పార్టీ ఇది.. తెలుగు ప్రజల కోసం పెట్టిన పార్టీ టీడీపీ అని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు తనను ఆదరించారని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న టీడీపీ పాత కమిటీలన్నీ రద్దు చేశారు. ఇక నుండి అన్ని గ్రామ, మండల, జిల్లాల వారీగా సభ్యత్వాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని నేతలకు సూచించారు. ఆన్లైన్ సభ్యత్వం తీసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశామని అన్నారు. పార్టీ సభ్యత్వాలను పెద్ద ఎత్తున నమోదు చేయించిన నేతలకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు తెలిపారు.
తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లలాంటివని.. రెండు రాష్ట్రాలు సమ అభివృద్ధి చెందాలనేదే టీడీపీ అభిమతమని వివరించారు. పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోయినా.. నేటికీ గ్రామాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందన్నారు. క్యాడర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. నేతలు సిద్ధం కావాలని అన్నారు. రాష్ట్రంలో పార్టీ ప్రక్షాళనలో భాగంగా చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ టీడీపీ పాత కమిటీలను రద్దు చేశారు. కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేయడం కోసం ఇకపై ప్రతినెలలో రెండు రోజులు తెలంగాణకు వస్తానని బాబు గతంలోనే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.