యెమెన్‌లో హుతీ తిరుగుబాటు దళాలపై సౌదీ అరేబియా చేసిన యుద్ధ ప్రకటనపై రాజు సల్మాన్ సంతకం ఎంబీఎస్ చేత ఫోర్జరీ చేయబడింది అనే ఆరోపణలు వచ్చాయి. ఈ సమాచారం ఒక మాజీ సౌదీ అధికారి వెల్లడించారు. అయితే, ఈ ఆరోపణలపై రియాద్ ఇంకా స్పందించలేదు. సౌదీ ఇంటెలిజెన్స్ అధికారి సాద్ అల్ జబ్రీ ఇటీవల బీబీసీతో జరిగిన ఇంటర్వ్యూలో, రియాద్‌లోని నమ్మకమైన వ్యక్తుల ద్వారా తనకు తెలిసిన ప్రకారం, “యెమెన్‌పై యుద్ధ ప్రకటనలో ఎంబీఎస్ తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. అందులో పాదాతి దళాల ఆక్రమణకు సంబంధించిన ఆదేశాలు ఉన్నాయి. రాజు మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో, ఎంబీఎస్ ఈ ఫోర్జరీ కి పూనుకున్నాడు” అని చెప్పారు. అల్ జబ్రీ గతంలో క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ నయిఫ్ కింద ఇంటెలిజెన్స్ అధికారి గా పనిచేశాడు మరియు అమెరికాతో అల్‌ఖైదాపై యుద్ధంలో నమ్మకమైన భద్రతా ప్రతినిధిగా వ్యవహరించాడు. ప్రస్తుతం, అతడు కెనడాలో జీవిస్తున్నారు. సౌదీ ప్రభుత్వంతో అతడికి గత కొంత కాలంగా వివాదాలు ఉన్నాయి మరియు అతని ఇద్దరు పిల్లలు ప్రస్తుతం రియాద్ జైల్లో ఉన్నారు.
సౌదీ అరేబియాలో ఎంబీఎస్ అప్రకటిత రాజుగా కొనసాగుతున్నారు. ఆయన తన తండ్రి స్థానంలో ప్రపంచ నేతలతో నేరుగా సమావేశమవుతున్నారు. 2015లో యెమెన్‌పై యుద్ధం ప్రారంభమైన తర్వాత, సౌదీపై ఎంబీఎస్ పట్టు పెరిగింది.
యెమెన్‌పై సౌదీ చేపట్టిన యుద్ధంలో దాదాపు 1,50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రారంభంలో త్వరగా ముగుస్తుందనుకున్నా, అనేక సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ యుద్ధం ప్రపంచంలోనే అతిపెద్ద మానవీయ సంక్షోభానికి కారణమైంది. యుద్ధం ప్రారంభ సమయంలో, ఎంబీఎస్ సౌదీ రక్షణ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.