బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో ధరలు పెరగడానికి గల కారణాలేమిటి? రాబోయే రోజుల్లో ఇంకా బంగారం ధరలు పెరుగుతాయా ? లేదా తగ్గుతాయా? అనే ప్రశ్నలు తరచూ వినబడుతున్నాయి. ముఖ్యంగా మన భారతదేశం లాంటి దేశాల్లో బంగారంపై పెట్టుబడిని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. 2024లో బంగారం ధరలు 31% పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.
గత 20 సంవత్సరాల్లో అంటే 2005 నండి 2024 వరకు బంగారం 455% బంగారం ధరలు పెరిగాయి. ఇంకా భవిష్యత్తులో ఎంతమేరకు ధరలు పెరుగుతాయని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు.గతంలో 50వేల మార్క్ ను దాటినప్పుడు ఇక బంగారం ధరలు ఇక్కడే ఉండవచ్చునని.. ఇక పెరగబోవని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా ఇటీవలి కాలంలో తులం బంగారం ధర 80వేల మార్క్ ను చేరుకుంది.
ధర పెరగడానికి కారణాలు
ఈ సమయంలో గోల్డ్ ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ తో పాటు, దేశీయ మార్కెట్ లో కూడా డిమాండ్ ఉండడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా దేశీయ మార్కెట్ లో ధరల పెరుగుదలకు కారణం ఫెస్టివల్ సీజన్ అని తెలుస్తోంది. పండగల సమయం కావడంతో భారతీయులు సెంటిమెంట్ గా బంగారాన్ని కొనుగోలు చేయటం పరిపాటిగా మారింది. పెళ్లిల్లు, దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఇలా వరుసగా పండుగలు రావడంతో కొనుగోళ్లు పెరగడంతో, డిమాండ్ పెరిగింది. తద్వారా ధరలు పెరుగుతున్నాయి.
అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచంలో ఆర్థిక,రాజకీయ పరమైన అనిశ్చితి ఉన్నప్పుడు స్వర్ణానికి డిమాండ్ పెరుగుతుంది. బంగారంపై పెట్టుబడి సురక్షితమైన అంశంగా చూడడం ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, అంతర్జాతీయంగా దేశాల మద్య టెన్షన్ వాతావరణం ఉన్నప్పుడు ప్రపంచ మార్కెట్ లో ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మద్య యుద్దం, అమెరికా- చైనా ట్రేడ్ వార్ ఇంకా కొనసాగుతుండడం, తాజాగా ఇజ్రాయిల్- హమాస్, ఇజ్రాయిల్-ఇరాన్, ఇజ్రాయిల్-హిజ్బుల్లాల మద్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈయుద్దం ప్రాంతీయ వార్ గా మారుతుందా? ఇరాన్ తన పొరుగున ఉన్న సౌదీ అరేబియా, ఖతార్,UEA లపై ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయనేది కూడా ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఎర్ర సముద్రంలో యెమన్ హూతీల తిరుగుబాటు దాడులు పెరుగాతాయా? అనే జియో పొలిటికల్ టెన్షన్ వాతావరణం కలిగి ఉండడం వంటి అంశాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటాయో ఇప్పటికిప్పుడు ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో ఇంకా అనిశ్చిత రాజకీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ఇంకా ఒక స్పష్టత రావడం లేదు. ట్రంప్ గెలుస్తారా? కమలా హారిస్ గెలుస్తారా? ఒపీనియన్ పోల్స్ అన్నీకూడా ఇద్దరి మద్య చాలా తక్కువ వ్యత్యాసం ఉందని చెబుతున్నాయి.
బంగారానికి, మిగతా పెట్టుబడి సాధనాలకు దగ్గరి సంబందం ఉంటుంది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయా? నిలకడగా ఉంటాయా? అనేది కూడా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు తమ విదేశీ నిల్వలను డైవర్సిఫై చేసి బంగారం నిల్వలను ఎక్కువగా పెంచుకుంటున్నాయి. అంతర్జాతీయ కరెన్సీ రిజర్వులలో డాలర్ తో పాటు బంగారాన్ని కూడా సమానంగా చూడడం కూడా ప్రధాన అంశంగా మారింది.
వీటితో పాటు బంగారం గనులు మూతపడుతున్నాయి. భారతదేశంలో 99% బంగారం దిగుమతి చేసుకోవడంపై ఆధారపడడం వల్ల సప్లై తక్కువగా ఉంటుంది. సప్లై తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా ధరల పెరుగుతున్నాయి.