తెంలగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహిస్తున్న సభకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు తెలంగాణ జన గర్జన సభగా పేరును ఖరారు చేశారు. ఈ సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఖమ్మంలోని వైరా రోడ్డులో SR గార్డెన్స్ ఖాళీ ప్రాంతంలోని సుమారు 100 ఎకరాల్లో ఈ సభ జరగనుంది. దీనికోసం పార్టీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. స్టేజీ 55 అడుగుల ఎత్తుతో, 144 అడుగుల పొడవుతో, 60 అడుగుల వెడల్పుతో, సుమారు 200 మంది నేతలు కూర్చొనేలా ఈసభా వేదికను ఏర్పాటు చేశారు. దీనితో పాటు 40 అడుగుల ఎత్తులో డిజిటల్ స్క్రీన్ ను కూడా ఏర్పాట్లు చేశారు. మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ, కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరనున్న నేపథ్యంలో ఖమ్మం పట్టణం మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్సీలు, తోరణాలు, జెండాలు, కటౌట్లతో నిండిపోయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ లో చేరనున్నారు. పొంగెలేటితో పాటు, ఆయన అనుచరులు కూడా పెద్దసంఖ్యలో హస్తం కండువాను కప్పుకోనున్నారు.
రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2:15 గంటలకు బయలుదేరుతారు. ఆయన నేరుగా ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం ఎయిర్ పోర్టుకు 4:40 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ లో సాయంత్రం 5.20 కి ఖమ్మం సభాస్ధలి వద్దకు చేరుకుంటారు. సుమారు రెండు గంటల పాటు సభా వేదికపై రాహుల్ గాంధీ ఉంటారు. సభ అనంతరం రోడ్డు మార్గం ద్వారా రాహుల్ గన్నవరం చేరుకోనున్నారు. అక్కడినుండి రాత్రి 11 గంటల 20 నిమిషాలకు ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ కి బయలుదేరి వెళ్తారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలలు మరికొన్ని నెలల్లోనే జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. తెలంగాణ ఇచ్చి కూడా 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయామని.. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గతానికి భిన్నంగా ముందడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలను పార్టీలోకి తీసుకొచ్చేలా ప్లాన్ వేసి సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి చేరికల ద్వారా పార్టీని అధికారం లోకి తీసుకు వస్తామని చెబుతున్నారు. మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా. ఆయనను రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సన్మానిస్తారు.