బీసీ సంక్షేమసంఘం జాతీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ నుండి YSRCP తరపున 2022 నుండి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్న కృష్ణయ్య అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉండగానే రాజీనామా చేయడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. ఢిల్లీలో సోమవారం స్పీకర్ ఫార్మాట్ లో ఆయన తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కు పంపారు. ఆయన రాజీనామా ఆమోదం పొందినట్లు మంగళవారం బులిటెన్ కూడా విడుదల అయింది. గత కొన్నిరోజులుగా, ఆయన బీజేపీలో చేరతారని, లేదా బీసీలకోసం కొత్త రాజకీయపార్టీని ఏర్పాటు చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై కృష్ణయ్య ఇంకా స్పందించలేదు. ఇటీవలే YSRCP ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. తాజాగా ఆర్ కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీల బలం 11 నుండి 8 కి పడిపోయింది.