దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 1.25 లక్షల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితం చూసే కార్యక్రమాన్నిరంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో గణేశ్ ఆగ్రో ఏజెన్సీ ఎరువుల దుకాణంలో ప్రధాని మోడీ డిజిటల్ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షించారు. ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. 1.25 లక్షల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయడం గొప్ప విషయమని అన్నారు. దేశంలోని రిటైల్ ఎరువుల దుకాణాలను దశలవారీగా పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా కేంద్రం మారుస్తోందని అన్నారు. మలిదశలో లక్ష 75 వేల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారని అన్నారు. ఇవి రైతుల యెక్క అనేక రకాల అవసరాలు తీరుస్తాయని, వ్యవసాయానికి అవసరమైన ముడిపదార్ధాలు (ఎరువులు, విత్తనాలు, పనిముట్లు), భూసార పరీక్షలు, విత్తనాలు, ఎరువుల కోసం పరీక్షా సౌకర్యాలు కడా అందిస్తాయని ఈటెల రాజేందర్ అన్నారు.
పలు రకాల అంశాలపై రైతులకు అవగాహన కల్పించడం, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడం, బ్లాక్, జిల్లా స్థాయి అవుట్ లెట్ లలో రిటైలర్‌ల సామర్థ్యాన్ని పెంపొందించడానికి పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాల ద్వారా చర్యలు అమలు జరుగుతాయని ఈటల రాజేందర్ తెలిపారు. అమెరికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో యూరియా, డిఎపిని రైతులు కొనలేని ధరలు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి 10వేలు చేతులో పెట్టి అన్ని సబ్సిడీలని ఎత్తివేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రైతుబంధు పేరిట రైతులను దారుణంగా మోసం చేశారని ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో దోచుకుంటున్నారని సీఎం కేసీఆర్ పై ఈటెల మండిపడ్డారు.