విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 21న విశాఖలో జరుగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రుల బృందం, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో అధికారులతో సమావేశమై ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
యోగా దినోత్సవం ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష
ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. యోగా అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత ఇష్టమైన కార్యక్రమమని, రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంతో మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే అవకాశం ఆంధ్రప్రదేశ్‌కు లభించడం శుభపరిణామమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రేపటి నుంచి నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతాయని, మొదటి మూడు రోజులు ప్రజలను ఈ కార్యక్రమాలకు సన్నద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
‘యోగాంధ్ర’లో భాగంగా 26 జిల్లాల్లో ప్రత్యేక యోగాభ్యసనం
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 26 రోజుల పాటు రోజుకో జిల్లాలో 5,000 మందితో వినూత్నంగా యోగాభ్యసన కార్యక్రమాలు నిర్వహించడానికి మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. ఈ కార్యక్రమాల్లో యువత, మహిళలు, సీనియర్ సిటిజన్లు, పోలీసులు, దివ్యాంగులు, ఉద్యోగులు వంటి వివిధ వర్గాలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. పాల్గొన్న వారికి ధృవపత్రాలు ఇవ్వాలని, 26 జిల్లాల్లో జరిగే యోగా కార్యక్రమాలపై ఒక క్యాలెండర్ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖులను కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని, ప్రధాన పట్టణాలు, నగరాల్లో యోగాభ్యసన కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 100 పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలలో 1,000 మందితో యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించారు.

2 కోట్ల మంది భాగస్వామ్యంతో మెగా ఈవెంట్
రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 2 కోట్ల మందిని భాగస్వామ్యం చేయాలని మంత్రుల బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా యోగా దినోత్సవంలో పాల్గొనే వారి నుంచి రిజిస్ట్రేషన్లు స్వీకరించాలని, ప్రజలను దీనికి సంసిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విశాఖలో ఏకంగా 5 లక్షల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యోగాపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, సోషల్ మీడియా క్యాంపెయిన్ చేపట్టాలని సూచించారు. ‘యోగాంధ్ర’ లోగోపైనా సమావేశంలో చర్చ జరిగింది. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రుల బృందానికి వివరించారు.
Also Read..| మహిళా సాధికారత కు ప్రభుత్వం కట్టుబడి ఉందిః సీఎం రేవంత్ రెడ్డి
ఈ సమీక్షా సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, హోంమంత్రి వంగలపూడి అనిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్ర డోలా బాలవీరాంజనేయస్వామి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, యోగా డే నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు అజయ్ జైన్, శశిభూషణ్, ముకేష్ కుమార్ మీనా, సురేష్ కుమార్, కోన శశిధర్, వినయ్ చంద్, వీరపాండ్యన్, హిమాంశు శుక్లా, దినేష్ కుమార్, ప్రకాష్ జైన్, విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంక బ్రతా బాగ్చీ తదితరులు పాల్గొన్నారు.