రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలన్నీ అమ్ముల పొదిలోని అస్త్రాలను వెలికి తీస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలు కొంత మంది వారసులకు ఈ సారి టికెట్ వచ్చేలా శతధా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నో చెప్పినప్పటికీ కొంత మంది పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న సీఎం కేసీఆర్ ఈ విషయంలో కొంత కఠినంగా ఉన్నట్లు చెప్పకనే చెబుతున్నారు. గెలుపు కోసం వ్యూహాలను రచిస్తున్న కేసీఆర్ ప్రస్తుత పరిస్థితులలో ఏ మాత్రం ప్రయోగాలు చేసినా బెడిసికొట్టే ప్రమాదం ఉందన్న అంచనాతో ప్రస్తుతం ఉన్న వారికే టికెట్లివ్వాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో కొంత మందికి తప్పా దాదాపు అందరికీ టికెట్లు కన్ఫామ్ అన్న ప్రచారం కూడా జోరందుకుంది.
వయోభారం, కుటుంబపరిస్థితులతో పాటు వారసత్వ రాజకీయాలకు కొంత మంది ఉవ్విళ్ళూరుతున్నారు. వారందరికీ కేసీఆర్ చెక్ పెట్టడంతో పాటు తన మనసులో మాటను తేటతెల్లం చేసినట్లు ప్రచారం సాగుతోంది. సర్వేల ప్రాతిపదికను టికెట్లను కేటాయించడంతో పాటు గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను కూడా అమలు చేసేలా యంత్రాంగాన్ని కూడా కేసీఆర్ సిద్దం చేస్తున్నారు. ఈ దఫా ఎన్నికల్లో కొత్త, యువ అభ్యర్థులను బరిలోకి దింపి ప్రయోగాలు చేయడం సీఎం కేసీఆర్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. ప్రజలతో మంచి సంబందాలు, అనుభవం గల నాయకులకు పెద్దపీట వేసి టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడే కేసీఆర్ తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ పార్టీలో చాలామంది నేతలకు మింగుడు పడడం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు ప్రజలు ఆదరించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి చాలామంది కీలక నాయకులు తమ వారసులకు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం వారికి టికెట్లు ఇచ్చే అవకాశమే లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.
దీంతో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరగా, కెసిఆర్ ఈసారికి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రమే పోటీ చేయాలని తేల్చి చెప్పారని సమాచారం. అందుకే రెండు రోజుల క్రితం బాన్సువాడలో జరిగిన ఒక సభలో తానే పోటీలో ఉంటున్నానని, తన కుమారుడికి టికెట్ అంటూ వస్తున్న పుకార్లను నమ్మోద్దని స్పష్టం చేశారు. మంత్రి తలసాని, ఎమ్మెల్సీ కడియం, శాసనమండలి చైర్మన్ గుత్తా తదితరులు ఈ సారి తమ వారసులకు టికెట్ ఇవ్వాలని అధినేత దృష్టికి తీసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే పలువురికి సీఎం కేసీఆర్ వారసులకు ఈ సారి ఎన్నికల్లో నో ఛాన్స్ అని తేల్చి చెప్పేసినట్టు సమాచారం. కేసీఆర్ నిర్ణయంతో ఈసారి ఎన్నికలలోనైనా తమ వారసులని రాజకీయాల్లోకి దింపాలని ప్రయత్నం చేస్తున్న పలువురు కీలక నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది.
మరో పక్క బీజేపీలోనూ ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా పని చేసిన ఏపీ జితేందర్ రెడ్డి తన కుమారుడు నితిన్ రెడ్డికి షాద్ నగర్ టికెట్ కావాలని కోరారు. అదే జిల్లాకు చెందిన మరో నేత డీకే ఆరుణ కూడా కుమార్తెకు టికెట్ ఆశించి నిరాశకు గురయ్యారు. కార్వాన్ నుంచి అయిదు పర్యాయాలు శాసససభకు ఎన్నికై గోల్కొండ టైగర్ గా పేరు సంపాదించుకున్న దివంగత బద్దం బాల్ రెడ్డి కుటుంబంలోని వారికి కూడా బీజేపీ నో చెప్పినట్లు సమాచారం. మరో వైపు ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు కూడా రాజకీయ అరంగ్రేటం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ పార్టీ నుంచి అంతగా స్పందన లేదని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూస్తుంటే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా ఉన్న నేపథ్యంలో వారసత్వ రాజకీయాలకు ఈ దఫా పార్టీలు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని స్పష్టమవుతోంది.