బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. “లీక్ వీరులను బయటపెట్టండి అంటే, గ్రీకు వీరుల్లా ఆడబిడ్డ పైన ప్రతాపం చూపిస్తున్నారు” అంటూ ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై కవిత ఓపెన్‌గా మాట్లాడారు.
నేను మంచిదాన్ని కాదు: ఎమ్మెల్సీ కవిత
“పార్టీలో పెయిడ్ ఆర్టిస్టులను కంట్రోల్ చెయ్యలేకపోతే నేను ఏంటో చూపిస్తా….నేను మంచిదాన్ని కాదు” అంటూ కవిత పరోక్షంగా కొందరిని హెచ్చరించారు. పార్టీలో తన పట్ల జరుగుతున్న తప్పుడు ప్రచారం వెనుక “పెయిడ్ ఆర్టిస్టులు” ఉన్నారని ఆమె ఆరోపించడం గమనార్హం.
Also Read…| NDSA నివేదికను L&T తిరస్కరించడం వారికి చెంపపెట్టు: కేటీఆర్
తెలంగాణ తల్లి విగ్రహం మార్పు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉండటాన్ని కవిత తప్పుబట్టారు. “తెలంగాణ తల్లి విగ్రహం మారిస్తే బిఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉన్నది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, కేసీఆర్‌కు నోటీసులు వచ్చినప్పుడు పార్టీ స్పందించకపోవడంపై కూడా ఆమె ప్రశ్నించారు. “కేసీఆర్ కు నోటీసులు ఇస్తే పార్టీ మౌనంగా ఉన్నది ఎందుకో చెప్పాలి” అని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై జాగృతి ఆధ్వర్యంలో తాను నిరసన రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు.
సోషల్ మీడియా దుష్ప్రచారం, కోవర్టుల బెడద: పార్టీపై కవిత కీలక వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కవిత ఆరోపించారు. “ఒక ఆడబిడ్డ మీద ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే బీఆర్ఎస్ నాయకులు స్పందించలేదు” అని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని తాను చెబితే తనపైనే దుష్ప్రచారం చేస్తున్నారని కవిత ఆరోపించారు. “కోవర్టులను కంట్రోల్ చేయాలి, కేసీఆర్ ను కాపాడుకోవాలి” అంటూ ఆమె పార్టీ అధిష్టానానికి కీలక సూచన చేశారు. “మా తండ్రికి వంద లేఖలు రాస్తాను మీకు ఏం నొప్పి” అంటూ తన తండ్రికి లేఖలు రాసే విషయంలో వస్తున్న విమర్శలకు కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు.
లిక్కర్ కేసులో రాజీనామా నిర్ణయం, సొంత పార్టీ కుట్రలు
లిక్కర్ కేసు సమయంలో తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని, అయితే ఆ సమయంలో కేసీఆర్ తనకు అలా చేయవద్దని సూచించారని కవిత వెల్లడించారు. అంతేకాకుండా, తాను ఎంపీగా పోటీ చేసినప్పుడు సొంత పార్టీ నాయకులే కుట్ర పన్నారని, తమ ప్రాంతం నుంచే ఆమెను ఓడించేందుకు ప్రయత్నించారని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ప్రాంతంలో ప్రొటోకాల్ పాటించాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ తనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారని కవిత పేర్కొన్నారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో కొత్త చర్చకు తెరలేపాయి.