ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఈడీ నోటీసులు పంపింది. శుక్రవారం విచారణకు రావలసిందిగా ఆమెకు తాజాగా నోటీసులు వచ్చాయి. లిక్కర్ స్కామ్ లో కవిత గతంలో కూడా ఈడీ విచారణ ఎదురుకున్నారు. నోటీసులు అందుకున్న తర్వాత ఆమె మీడియా సమావేశంలో బీజేపీ పై పలు ఆరోపణలు చేశారు.
తనకు నోటీసులు అందాయని, ఇది రాజకీయ ప్రేరేపిత చర్యే అని తాను ముందు నుంచి చెబుతున్నానని చెప్పారు. ఇవి ఈడీ నోటీసులు కాదని.. మోడీ నోటీసులని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం, ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఇప్పుడు మళ్లీ నోటీసులు పంపారని విమర్శించారు. గత సంవత్సర కాలంగా టీవీ సీరియల్ లాగా ఈ నోటీసులు వస్తూనే ఉన్నాయని కవిత అన్నారు. తెలంగాణ ప్రజలు ఈ నోటీసులను సీరియస్‌గా తీసుకోవడం లేదని తెలిపారు. అయితే ఒక బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా, ఈ విషయాన్నితమ పార్టీ లీగల్ టీంకు చెప్పామని… లీగల్ టీమ్ ఇచ్చే సలహాల అనంతరం దీనిపై ముందుకు వెళ్తానని తెలిపారు. తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమని.. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకో, కాంగ్రెస్‌కో బీ టీమ్ కాదని, తాము ప్రజలకు ఏ టీమ్ అని స్పష్టం చేశారు.