పకృతి విలయానికి అతలాకుతమైన కేరళలోని వయనాడ్ లో తెలంగాణ మంత్రి సీతక్క శనివారం పర్యటించారు. ములుగు డిసిసి అధ్యక్షుడు పైడాకుల అశోక్ తో కలిసి ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మంత్రి సీతక్క, బాధిత కుటుంబాల సహాయార్థం తాను సేకరించిన రూ. 20 లక్షల చెక్ ను స్థానిక ఎమ్మెల్యే టి. సిద్దికికి అందించారు. దీంతో పాటు సుమారు పది లక్షల విలువగల దుస్తులు, నిత్యావసర వస్తువులను స్థానిక నాయకులకు అందజేశారు. వందల సంఖ్యలో మృతులను సామూహిక ఖననం చేసిన ముండక్కై స్మశాన వాటికలో మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడే మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చే క్రమంలో సీతక్క భావోద్వేగానికి గురయ్యారు.
జూలై 30న వయనాడ్ లో సంభవించిన విపత్తు వందల మందిని బలిగొనగా ఇప్పటి వరకు చాల మంది ఆచూకి గల్లంతయ్యింది. గుర్తు పట్టరాని విధంగా మారిన మృతదేహాల నుంచి డీఎన్ఏ లు సేకరించి అక్కడి ప్రభుత్వమే ముండక్కై స్మశాన వాటికలో సామూహికంగా ఖననం చేసింది. తమ ఆప్తుల చివరి చూపునకు సైతం నోచుకోని ఎందరో దుఖంతో స్మశాన వాటికలో తమ వారి సమాధులను వెతుక్కుంటున్నారు. తన తల్లిని ఇక్కడే ఖననం చేసారని తెలుసుకున్న ఓ యువతి ఆ ప్రాంతానికి చేరుకుని.. చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయాను అంటూ తన తల్లి సమాధి వద్ద బోరున విలపించింది. దీంతో మంత్రి సీతక్క భావోద్వేగానికి లోనైయ్యారు. యువతిని దగ్గరకు తీసుకుని అతి కష్టం మీద ఓదార్చ గలిగారు. అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడిన సీతక్క..ఇటువంటి కష్టం ఎవరికీ రావోద్దన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను చూసి హృదయం ద్రవించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోయిన ప్రాణాలను తీసుకురాలేకపోయినా…తనకు ఎంతో అనుబంధం ఉన్న వయానాడ్ ప్రజలకు నైతిక మద్దతు పలకానికి వచ్చినట్లు తెలిపారు. వాయనాడ్ ఎల్లప్పుడూ తన హృదయానికి దగ్గరగా ఉంటుందని తెలిపారు. 24 గంటలూ పనిచేస్తున్న రెస్క్యూ టీమ్‌లు, స్థానిక అధికారులు, వాలంటీర్ల అవిశ్రాంత ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు వెల్లడించారు. విపత్తు వల్ల నష్టపోయిన వారి జీవితాలను పునర్నిర్మించడంలో.. వీలున్న ప్రతి సహాయాన్ని అందిస్తామని మంత్రీ సీతక్క భరోసా ఇచ్చారు.