Thursday, March 27, 2025
HomeNewsInternationalప్రకృతిని కాపాడుకుంటూ.. అభివృద్ధి వైపు: ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరంలో కిషన్ రెడ్డి

ప్రకృతిని కాపాడుకుంటూ.. అభివృద్ధి వైపు: ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరంలో కిషన్ రెడ్డి

ప్రకృతిని కాపాడుకుంటూ.. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ పరస్పర సమన్వయంతో ముందుకెళ్లినపుడే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్న సమయానికి చేరుకోవచ్చని భారత పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీనికోసం ప్రపంచదేశాలన్నీ ఏకతాటిపైకి రావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో ఆర్థిక ప్రగతి, సామాజిక, పర్యావరణ సుస్థిరత అంశంపై న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరం (HLPF) వేదికగా జరిగిన సదస్సులో కిషన్ రెడ్డి ప్రసంగించారు.
ఈ సమావేశంలో భారతదేశం తరపున పాల్గొనడం గర్వంగా ఉందన్నారు.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో గత దశాబ్ద కాలంగా ఆర్థిక, సామాజిక, పర్యావరణ స్థిరత్వమే ప్రధాన ఎజెండాగా చేపట్టిన పాలసీలు, ప్రాధాన్యతలతో భారతదేశం సాధిస్తున్న ప్రగతిని ఆయన ప్రపంచ దేశాలకు వివరించారు. గత దశాబ్ద కాలంగా పర్యావరణ సుస్థిరత కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా నేడు టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు ఎజెండా నిర్దేశించడంతో పాటు ముందుండి విజయవంతంగా నడిపామని వివరించారు. జీ-20 ప్రెసిడెన్సీ ద్వారా పర్యాటక వర్కింగ్ గ్రూపు సమావేశాల నిర్వహణతో పాటు గోవాలో జూన్ నెలలో జరిగిన జీ20 సభ్యదేశాలు, ఆతిథ్య దేశాల పర్యాటక మంత్రుల సమావేశంలో ఏకగ్రీవంగా ‘గోవా రోడ్ మ్యాప్’కు ఆమోదం తెలిపిన విషయాన్ని కెంద్ర మంత్రి ప్రస్తావించారు.

గ్రీన్ టూరిజం సుస్థిర, బాధ్యతాయుతమైన, హరిత పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా సరైన ఫలితాలను సాధించడం, డిజిటలైజేషన్ పర్యాటక రంగంలో సుస్థిరత, సమగ్రతను సాధించేందుకు డిజిటలైజేషన్ ద్వారా ఓ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటుచేసుకోవడం, స్కిల్స్ యువత నైపుణ్యాలకు పదునుపెడుతూ పర్యాటక రంగంలో ఉపాధి, వ్యాపారసామర్థ్యాన్ని పెంచేలా చర్యలు, టూరిజం MSME లకు పర్యాటక రంగంలోని MSME లకు, స్టార్టప్‌లకు, ప్రైవేటు రంగానికి సరైన ప్రోత్సాహాన్ని అందిస్తూ.. సృజనాత్మకతకు పెద్దపీట వేయడం, డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ గమ్యస్థానాల్లో అవసరమైన నిర్వహణ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంపై పునరాలోచన తద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సమగ్రమైన విధానంతో ముందుకెళ్లడం అనే అయిదు కీలకమైన అంశాలపై ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని కేంద్రమంత్రి ఈ సంధర్బంగా గుర్తుచేశారు.

d5f8c05f 575b 4a5e be3c 8d691d0b35d5

గోవా రోడ్ మ్యాప్ ద్వారా ప్రత్యక్షంగా, సానుకూలంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా అడుగులు పడ్డాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆలోచనల మేరకు ఘనమైన భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం కేంద్రంగా పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రపంచస్థాయి మౌలికవసతుల కల్పనతో ముందుకు వెళ్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటుగా, వారసత్వాన్ని కాపాడుకునేందుకు వివిధ దేశాలతో కలిపి థీమ్ బేస్డ్, బుద్దిస్ట్ సర్క్యూట్, రామాయణ సర్క్యూట్, హిమాలయన్ సర్క్యూట్, హెరిటేజ్ సర్క్యూట్ లాంటి వాటిని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారత ప్రభుత్వం రూపొందించిన నూతన జాతీయ పర్యాటక విధానం ముసాయిదాలో ఇలాంటి వాటికి సరైన ప్రాధాన్యత కల్పించామని తెలిపారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్‌తో పాటు ప్రపంచ పర్యాటకానికి కూడా ఎంతో సానుకూల ఫలితాలను అందిస్తుందని అన్నారు.

ప్రకృతితో అనుసంధానమైన జీవన విధానం వంటివి భారతదేశంలో పర్యాటక భివృద్దికి సానుకూలమైన అంశాలని అన్నారు. భారతదేశ సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేద, యోగ, నేచురోపతి వంటివన్నీ ప్రకృతితో మమేకమై జీవించాలన్న ఆలోచనను ప్రతిబింబిస్తాయని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భారతీయ జీవన విధానాన్ని దృష్టిలో ఉంచుకుని, రానున్నరోజుల్లో ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ దిశగా మరిన్నిచర్యలు చేపట్టనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.

ప్రధానమంత్రి ఇటీవలే పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతగా జీవనవిధానాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేసే ఉద్దేశంతో మిషన్ లైఫ్ (LiFE – లైఫ్‌స్టయిల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్) ను ప్రారంభించిన విషయాన్నికిషన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజలతో పాటు పర్యాటకులు కూడా చిన్న ఆలోచనలు, చిన్న మార్పుల ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావొచ్చని అన్నారు.

d5f8c05f 575b 4a5e be3c 8d691d0b35d5 1


పర్యావరణ స్పృహతో పాటు పర్యాటకానికి సరైన గుర్తింపును తీసుకొచ్చే లక్ష్యంతో పాఠశాలలు, కాలేజీలలో‘యువ టూరిజం క్లబ్’లను ఏర్పాటుచేశామన్నారు. తర్వాత తరమైన భారత పౌరుల్లో పర్యాటక, పర్యావరణ స్పృహను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ క్లబ్స్ ద్వారా సానుకూల ఫలితాలు వస్తున్నాయని అన్నారు. 2030 నాటికి పూర్తిచేసేలా నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని కూడా ఈ సమావేశాలలో సమీక్షించారు.

పర్యాటక రంగ సుస్థిరత, సమగ్రత లక్ష్యాల ప్రాధాన్యతతో భారత ప్రభుత్వం చేపడుతున్నకార్యక్రమాలను చూసేందుకు ‘మీరంతా భారత్ కు రండి’అని కిషన్ రెడ్డి వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు సాబా కొరోశీ, ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి (UNECOSOC) అధ్యక్షురాలు లాషెజరా స్టోయేవాతోపాటు వివిధ దేశాల పర్యాటక మంత్రులు, UNWTO ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, ప్రపంచ పర్యాటకరంగ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments