భాగ్యనగరంలో ఆషాడ బోనాల జాతర ఆదివారం జూన్ 16 న అమ్మవార్లకు బోనాలు, 17న సోమవారం తొట్టెల ఊరేగింపుతో ముగియనున్నాయి. గోల్కొండ కోటలో ప్రారంభమైన బోనాల వేడుకలు, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయాల తరువాత పాత బస్తీకి చేరుకున్నాయి. బోనాల వేడుకలకు అమ్మవారి ఆలయ పరిసరాలతో పాటు వీధులన్నీ రంగు రంగుల విద్యుత్ లైట్లతో, వేపాకులతో అలంకరించారు. చివరి ఆదివారం పాతబస్తీలోని లాల్ దర్వాజ అమ్మవారికి బోనాలు సమర్పించటం ఆనవాయితీ. చివరగా తొట్టెల ఊరేగింపుతో ఈ వేడుకలు ముగుస్తాయి. హైదరాబాద్ లో నెలరోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన బోనాల పండుగ ఈ నెల 17తో ముగుస్తుంది. భక్తులతో పాటుగా ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా అమ్మవారిని దర్శించుకోనున్నారు.
జూలై 16, 17వ తేదీలలో అమ్మవారికి బోనాల సమర్పించుకోవటంతోపాటు, ఘటాల ఊరేగింపులు, తొట్టెల ఊరేగింపు, పలహారం బండ్ల ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. అషాడమాస బోనాల సందర్భంగా వారం రోజుల నుండి ఉత్సవాలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం అమ్మవారికి మహాహారతి నిర్వహించారు. మహాహారతికి అధికంసంఖ్యలో ఆలయం బయట మహిళలు నిలబడి అమ్మవారికి హారతి ఇచ్చారు. ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.