తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాదే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై నూతన సీజేతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆరవ ప్రధాన న్యాయమూర్తిగా అలోక్ ఆరాదే ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దాదాపుగా 13 నెలల తరువాత సీఎం కేసీఆర్ రాజభవన్ కు వచ్చారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ కావడంతో ఆ స్థానంలో జస్టిస్ అలోక్ ఆరాదే నియమితులయ్యారు.

ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. 1964 ఏప్రిల్ 13న రాయపుర్ లో జన్మించారు. 1988 జులై 12న అడ్వకేట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంబించారు. 2007లో సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. 2009లో మధ్యప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. 2011 లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందగా.. 2016 లో జమ్మూ కశ్మీర్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2018 మే 11 నుండి ఆగస్టు 10 వరకు అదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2018 లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2022 జులై 3 నుండొ అక్టోబర్ 15వరకు కర్ణాటక హైకోర్ట్ తాత్కాలిక సీజేగా పని చేశారు. నూతన సీజే ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వచ్చారు. 2022 జూన్ 28 తర్వాత రాజ్‌భవన్‌కు కేసీఆర్ రావటం అక్కడ ప్రత్యేకత సంతరించుకుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్ లో పెట్టడంతో ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆ తరువాత గవర్నర్ ఆ బిల్లులను ఆమోదించారు. అయితే గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే తిరిగి రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య దూరం తగ్గిందనే వాతావరణం కనిపిస్తోంది.