రాష్ట్రంలో ఈ రోజు నుండి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి. మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సీటు వద్దకు వెళ్లి ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. తరువాత ఇరువురూ ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు నేతలు దాదాపు పది నిమిషాల పాటు చిట్ చాట్ చేశారు.
అసెంబ్లీ లాబీ నుండి బయటకు వస్తున్న క్రమంలో మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిల మధ్య సరదాగా చర్చ జరిగింది. టీ షర్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేని చూసి పిల్లలతో కలిసి తిరిగితే ఎట్లా అన్నా.. అని కేటీఆర్ జగ్గారెడ్డిని అడిగాడు. టీ షర్ట్ వేసుకుంటే పిల్లల లాగా ఉంటారా.. అని జగ్గారెడ్డి మంత్రిని తిరిగి ప్రశ్నించారు. అయితే అప్పటికే జగ్గారెడ్డితో TNGO రాష్ట్ర అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ ఉన్నారు. మీ జగ్గారెడ్డిని ఈసారి సంగారెడ్డిలో గెలిపిస్తావా ? అని కేటీఆర్ ప్రశ్నించగా.. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపించి.. మన దగ్గరకు తీసుకొస్తా.. అని మామిల్ల రాజేందర్ సరదాగా కేటీఆర్ తో వ్యాఖ్యానించారు. అక్కడ కొద్దిసేపు వారు సరదాగా నవ్వుకున్నారు.