అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేశాడు ఓ ప్రభుద్ధుడు. నమ్మకంగా ఉంటూనే యజమానిని నట్టేట ముంచాడు. దొరికందే తడువుగా అందిన కాడికి దోచుకొని ధర్జాగా వెళ్లిపోయాడు. 7కోట్ల విలువైన బంగారు నగలతో కారులో పరారయ్యడు. హైదరాబాద్ లోని మధురానగర్ లో శుక్రవారం సాయంత్రం ఈఘటన చోటుచేసుకుంది.
ఎస్సార్ నగర్ పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్ లో నగల వ్యాపారం చేసే రాధిక ప్రముఖ నగల దుకాణాలనుండి వజ్రాభరణాలను కొనుగోలు చేసి వాటిని అవసరం అయిన వారికి సరఫరా చేస్తూ ఉంటారు. శ్రీనివాస్ అనే వ్యక్తి ఆమె వద్ద కొన్ని సంవత్సరాలుగా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నమ్మకస్తుడుగా ఉండడంతో అప్పుడప్పుడూ కస్టమర్లకు నగలను అతనితో పంపించేవారు. ఈ క్రమంలోను శ్రీనివాస్ కు నగలపై కన్నుపడింది. ఎలాగయినా నగలను తస్కరించాలని అనుకున్నడు. సరైన సమయం కోసం అతను వేచి చూశాడు.
అతను ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. నగల వ్యాపారి రాధిక ఉంటున్న అపార్ట్ మెంట్ లోఉండే అనూష 50 లక్షల విలువైన నగలను ఆర్డర్ చేశారు. అయితే శుక్రవారం ఆభరణాల డెలివరీ ఉందని రాధిక అనూషకు ఫోన్ చేశారు. ఆ సమయంలో తాను ఇంటి వద్ద లేనని.. మధురానగర్ లోని తమ బంధువుల ఇంటిలో ఉన్నాని చెప్పారు. ఆభరణాలను అక్కడికే పంపించాలని రాధికతో చెప్పారు. సేల్సమెన్ అక్షయ్, డ్రైవర్ శ్రీనివాస్ లతో మొత్తం 7 కోట్ల విలువ చేసే నగలను డెలివరీ కోసం పంపించారు. ఆ నగలలో 50 లక్షల విలువ చేసే నగలు అనూషకి సంబంధించినవి. మిగతా వజ్రాభరణాలు సిరిగిరిరాజ్ జెమ్స్ అండ్ జువెల్లర్స్ లో ఇవ్వవలసి ఉంది.
మధురానగర్ లోని కస్టమర్ అనూష బంధువుల ఇంటికి చేరుకోగానే డ్రైవర్ శ్రీనివాస్ పథకం వేశాడు. తాను ముందుగానే వేసుకున్న స్కెచ్ ప్రకారం అనూషకు ఆర్డర్ డెలివరీ చేయడానికి సేల్సమెన్ అక్షయ్ ఒక్కడినే ఇంటి లోపలికి పంపాడు. అక్షయ్ వచ్చేటప్పటికి డ్రైవర్ నగలు, వాహనంతో సహా పరారయ్యడు. సేల్స్ మెన్ వెంటనే ఫోన్ లో రాధికకు జరిగిన విషయం చెప్పడంతో, వెంటనే ఆమె ఎస్సార్ నగన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ ల ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ అపహరించుకొని వెళ్లిన నగల విలువా దాదాపుగా 7 కోట్లు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యదు చేశారు.