కొత్తగూడెం బీఆర్ఎస్ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుకు తెలంగాణ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదని సంచలన తీర్పు ఇచ్చింది. ఆయన 2018 ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలు సమర్పించినందుకు ఆయనకు రూ.5 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. 2018 ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వనమా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అప్పట్లో టీఆర్ఎస్ నుండి బరిలో నిలిచిన జలగం వెంకట్రావుపై దాదాపు 4 వేల ఓట్ల పై చిలుకు ఆధిక్యంతో గెలుపొందారు. ఆ తర్వాత ఆయన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటుగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వనమా వెంకటేశ్వర రావు ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను తప్పుగా ఇచ్చినట్టు, అలాగే వనమా ఎన్నిక రద్దు చేయాలని జలగం వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు సుధీర్ఘ కాలం పాటు విచారణ జరిపి ఇటీవల తీర్పును రిజర్వ్ లోపెట్టింది. హై కోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పులో వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదని… 2018 నుండి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. అలాగే, ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఇచ్చినందుకు వనమా వెంకటేశ్వర్ రావుకు రూ.5 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. మరోవైపు, ఈ తీర్పుపై వనమా వెంకటేశ్వర రావు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని.. ఇప్పటికే లాయర్లతో చర్చిస్తున్నారని సమాచారం.