Menu

  • Home
  • తెలంగాణ
  • రాజకీయ కక్షతోనే కేటీఆర్ పై ఫార్ములా ఈ కేసు: హ‌రీష్ రావు
harish rao alleges political vendetta against ktr in formula e race

రాజకీయ కక్షతోనే కేటీఆర్ పై ఫార్ములా ఈ కేసు: హ‌రీష్ రావు

రాజకీయ కక్షతోనే కేటీఆర్ పై ఫార్ములా ఈ కేసు పెట్టార‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు ఆరోపించారు. కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి, ఆయన్ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని హరీశ్ రావు ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని ప్రపంచవ్యాప్తంగా పెంచిన ప్రతిష్ఠాత్మక ఫార్ములా ఈ రేస్ నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లుగా ‘కోడిగుడ్డుపై ఈకలు పీకుతోంది’ అని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలు పరాకాష్టకు చేరుకున్నాయని హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను రేవంత్‌ రెడ్డి నొక్కే ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన విమ‌ర్శించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడుతూ, ఎండగడుతున్న కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించడం ద్వారా రాక్షసానందం పొందాలనుకోవడం పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని హరీశ్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఈ దుర్మార్గమైన వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి పొందేందుకు చేస్తున్న ఈ చిల్లర డ్రామాలు తమ పార్టీకి ఎలాంటి నష్టం కలిగించలేవని ఆయన పేర్కొన్నారు.

Also Read..| ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కు బీజేపీ మద్దతు: ఎంపి చామల

అక్రమ కేసులు బనాయించడం ద్వారా కేటీఆర్ , బీఆర్‌ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని హరీశ్ రావు అన్నారు. కేటీఆర్‌కు బీఆర్‌ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని, రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని చట్టపరంగా, న్యాయపరంగా గట్టిగా ఎదుర్కొంటామని ఆయన హెచ్చరించారు.

Share the post