తెలంగాణ సాంప్రదాయంలో భాగం అయిన బోనాలు హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్నాయి. భాగ్యనగరంలోని ఆలయాల్లో భక్తులు అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. ఆషాఢమాసం చివరివారం ఆదివారం నిర్వహించే బోనాలతో పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సింహవాహిని మహంకాళి అమ్మవారికి తెల్లవారు జాము నుండే భక్తులు బోనాలు, మొక్కులు చెల్లించుకుంటున్నారు.డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల వీరంగాలతో భాగ్యనగరం పులకించిపోయింది.
తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని,, ఇంద్రకరణ్ రెడ్డిలు మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో పాటు ప్రముఖులు, ఇతర రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ లాల దర్వాజా ఆలయాన్ని సందర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మహంకాళి అమ్మవారి దీవెనలు.. కరుణా కటాక్షాలు ప్రజలందరికీ ఉండాలని తాను అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలు అందరూ ఐకమత్యం తో బోనాల ఉత్సవాలను జరుపుకోవాలని అన్నారు.
హైదరాబాద్ లోని ప్రముఖ ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులి పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ఎక్కువగా వర్షాలుబ్కురవాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి తలసాని అన్నారు. అదే విధంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఈ ఆలయానికి తొమ్మిది కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని తెలిపారు. త్వరలోనే ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. ఇప్పటికే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని కృష్ణ శిలలతో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని మంత్రి అన్నారు.
అమ్మవారి దర్శనానికి ప్రముఖులు కూడా తరలి వచ్చారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, పీసీసీ చీఫ్ రెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోబన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు, బీజీపీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి, క్రికెటర్ మిథాలీ రాజ్, విజయశాంతి, దాసోజు శ్రవణ్, ఫిరోజ్ ఖాన్ హీరోయిన్ వైష్ణవి తో పాటు పలువురు రాజకీయ నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు రెండు వేల మందితో భద్రత కల్పించారు. ప్రత్యేక సీసీటీవీ కెమెరాల ద్వారా భద్రతను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
రాజ్ భవన్ లో బోనాల సంబరాలు ఘనంగా జరిగాయి. గవర్నర్ తమిలిసై సౌందర రాజన్ ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ అమ్మ వారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిలిసై బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు గవర్నర్ తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న బోనాల జాతరకు తనకు ఆహ్వానం అందలేదని గవర్నర్ తెలిపారు.