Wednesday, March 26, 2025
HomeNewsTelanganaGroup 1: జీవో 29 రాజ్యాంగ విరుద్దం.. గ్రూప్ 1 ఆందోళనకు మద్దతు: బండి సంజయ్

Group 1: జీవో 29 రాజ్యాంగ విరుద్దం.. గ్రూప్ 1 ఆందోళనకు మద్దతు: బండి సంజయ్

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ 1 (Group 1) అభ్యర్థుల ఆందోళనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడే ప్రశ్నార్థంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరుపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీలోనే కొందరు నేతలు సీఎం సీటు కోసం గోతికాడి నక్కలా కాచుక కూర్చొన్నారని అన్నారు. రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థుల గొడవ ఉధృతమై ప్రభుత్వం పడిపోవాలని వారే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గ్రూప్ 1 అభ్యర్థులు చేస్తున్న ఆందోళన పూర్తిగా న్యాయమైందని అన్నారు. వారి న్యాయపరమైన డిమాండ్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నిరుద్యోగులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం అమానుషం అన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ నిరుద్యోగుల వద్దకు సామాన్య కార్యకర్తగా వెళ్లి అండగా ఉంటానని తెలిపారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 29ని ఉపసంహరించుకొవాలని.. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

లాఠీఛార్జ్ దుర్మార్గమైన చర్య

గ్రూప్ 1 అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జ్ దుర్మార్గమైన చర్యగా బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులపై రాక్షసంగా వ్యవహరిస్తోందని అన్నారు. నిరుద్యోగులను, విద్యార్ధులను గుంజుకొచ్చి మరీ పోలీసులతో కొట్టిస్తారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులు చేసిన తప్పేమిటని .. మానవతా దృక్పథంతో వ్యవహరించవలసిన రాష్ట్ర ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ ను నమ్మి లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటే ఇప్పుడు నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని దుయ్యబట్టారు. జీవో 29 జారీ చేసినోళ్లకు బుద్దిలేదని ఆయన అన్నారు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తారా? కాంగ్రెస్ అనాలోచిత, దుర్మార్గపు, చిల్లర నిర్ణయమని మండిపడ్డారు. నిరుద్యోగుల పొట్ట కొట్టడానికే 29 జీవోను జారీ చేశారని అన్నారు. ఈ జీవోను సవరించి న్యాయం చేయమని అడిగితే కొట్టిస్తారా?. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేస్తే తప్పేంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్..

గత బీఆర్ఎస్ సర్కార్ కు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు తేడా ఏమీలేదని బండి సంజయ్ అన్నారు. ప్రజలకు హామీలు ఇవ్వడం, మోసం చేయడంలో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లయినా, ఇప్పటివరకూ గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్ ఆలోచనా విధానానికి అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఈ రెండు పార్టీలకు ఉద్యోగాలను భర్తీ చేసి, నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచనే లేదని అన్నారు. నోటిఫికేషన్లలో తప్పులు, క్వశ్చన్ పేపర్లలో తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తప్పుడు జీవోలతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.నిరుద్యోగుల మధ్య చిచ్చుపెట్టి, వారు కొట్టుకునేలా చేసి లబ్ది పొందేందుకే జీవో నెంబర్ 29ని జారీ చేశారని ఆరోపించారు. కేటీఆర్ నిరుద్యోగులకు బ్రాండ్ అంబాసిడర్ లాగా ఫోజు కొట్టడం సిగ్గు చేటని విమర్శించారు. దొంగ నోటిఫికేషన్లతో నిరుద్యోగుల ఉసురు పోసుకునేలా చేసిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు. నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేనేలేదని తేల్చి చెప్పారు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునేలా వంచించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు.

నిరుద్యోగులకు అండగా ఉంటా

తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 29ను ఉపసంహరించుకొని, గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే నిరుద్యోగులకు అండగా తను ఉంటానని హామీ ఇచ్చారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ అశోక్ నగర్ వెళ్లి నిరుద్యోగుల ఆందోళనకు మద్దతు ఇస్తానని తెలిపారు. ఇంకా ఈ సమస్య జఠిలం కాకుండా వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలే తారుమారు అవుతాయని చరిత్ర చెబుతుందని అన్నారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రమాదకర పరిస్థితిలో పడబోతోందని హెచ్చరించారు. నిరుద్యోగులతోపాటు వారి కుటుంబాలు, బీజేపీ కార్యకర్తలంతా వారికి అండగా ఉంటారని తెలిపారు. నిరుద్యోగుల పక్షాన అవసరమైతే తాను కూడా ఆందోళనలో పాల్గొంటానని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి పదవి సంగతి తరువాత, నాకు నిరుద్యోగుల జీవితాలే ముఖ్యమని అన్నారు. నిరుద్యోగులపై లాఠీచార్జ్ చూసి బాధపడుతున్నానని అన్నారు. తానుకేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ.. ఒక కార్యకర్తగా నిరుద్యోగుల వద్దకు వెళ్లి వారికి సంపూర్ణ మద్దతిస్తానని తెలిపారు.

కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓ జోక్

మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ఓ జోక్ లాగా కొట్టిపారేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. మూసీపై కేసీఆర్ ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నేతలు మర్చిపోయినట్లున్నారని అన్నారు. మూసీపై సీఎం రేవంత్ రెడ్డి రోజుకో మాట మారుస్తూ, గజినీ లాగా మారుతున్నడని విమర్శించారు. రేవంత్ రెడ్దే మూసీ సుందరీకరణకు రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి, ఇప్పుడు నేనే అనలేదని అంటున్నారని ఎద్దేవా చేశారు. మూసీ ప్రక్షాళనకు ప్రపంచ బ్యాంకు నుండి అప్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సాగిలపడుతోందని దుయ్యబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిస్టులతో కలిసి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడును ప్రపంచ బ్యాంకు జీతగాడని అనలేదా అని ప్రశ్నించారు.

Also Read.. Vice Chancellor: తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు వీసీల నియామకం

మూసీ పేరుతో దోపిడీకి బీజేపీ వ్యతిరేకం

మూసీ పేరుతో లక్షన్నర కోట్ల ప్రజా ధనం దోపిడీకి బీజేపీ వ్యతిరేకం.. మూసీ పేరుతో 11 వేల ఇండ్లను కూల్చడానికి వ్యతిరేకం.. అని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతనైతే 11 వేల కుటుంబాలకు ముందుగా ఇండ్లు కేటాయించి, అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబాల జీవనోపాధికి ఢోకా లేకుండా చేసిన తరువాతే మూసీ ప్రక్షాళనకు ముందుకు వెళ్లాలని అన్నారు.

హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. అక్రమ లే అవుట్ల పేరుతో హైడ్రా సర్వే నెంబర్లను రిలీజ్ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోందని అన్నారు. స్టాంప్ డ్యూటీ వసూలు చేసి ఆ ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసింది ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. మళ్లీ ఆ భూములే అక్రమ లే అవుట్లు అంటూ ప్రజలకు గుండె పోటు వచ్చేలా చేయటం ఏమిటని అన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే అక్రమ లేఅవుట్లకు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను, బాధ్యులను జైలుకు పంపాలని అన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments