బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం ఫాదర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేడ్చల్ మల్కాజిరి జిల్లాలలోని సంక్షేమ అధికారుల పరిధిలోని వృధాశ్రమాలు, అనాధ శరణాలయాలు మరియు బాల సదన్ల నుండి సుమారు 755 మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారని రాష్ట్రపతి నిలయం మేనేజర్ డా. కె. రజని ప్రియ తెలిపారు. అంతే కాకుండా ఈతరం చిన్నారులు, యువత తల్లిదండ్రుల విలువ తెలుసుకొని, వృధాప్యంలో వారిని బాధ్యతగా చూసుకోవవాలని రజని ప్రియ అన్నారు.

సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలలో పెద్దలు, పిల్లలు ఉత్సాహంతో పాల్గొన్నారు. కుటుంబంలో తండ్రి పాత్రను, ఔన్నత్యాన్ని తెలియజెప్పారు. అలాగే తండ్రి ప్రేమ మరియు బాధ్యత గురించి తెలుపుతూ గీతాలాపన మరియు నృత్య ప్రదర్శన లాంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమం వృధాశ్రమంలో ఉంటున్న వృద్ధులు మరియు బాలసదనంలో ఉంటున్న చిన్నారులను అనుసంధానం చేసేవిధముగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గాయత్రి స్కూల్ అఫ్ కూచిపూడి డాన్స్ నాగారం, కలర్స్ అఫ్ డాన్స్ – KPHB తదితర చిన్నారులు నృత్య ప్రదర్శనతో అలరించారు. సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ హయత్ నగర్, సాకేత్ పర్బనవ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కూకట్ పల్లి, ఆధార్ వెల్ఫేర్ బాల నగర్, గౌరి ఆశ్రమం గర్ల్స్ హెూమ్ బహదురుపల్లి, గవర్నమెంట్ చిల్డ్రన్ గర్ల్స్ హెూమ్ తదితర ఆశ్రమాలు మరియు బాలసదన నుండి చిన్నారులు, పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 755 మందికి రాష్ట్రపతి నిలయంలోనికి ఉచిత సందర్శన కల్పించారు.






