పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్మల్ పట్టణంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని అమర వీరుల స్థూపం వద్ద నుండి ప్రారంభమై మంచిర్యాల ఎక్స్ రోడ్ నుండి ఎస్పీ క్యాంప్ కార్యాలయం, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా నుండి తిరిగి అమర వీరుల స్థూపం వరకు బైక్ ర్యాలీ కొనసాగింది.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల ఐపిఎస్ ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. ప్రజా రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్ధతతో పని చేస్తున్నారని అన్నారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ సైనికులలాగా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే జరుపుతున్నామని తెలిపారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలతో మరింత మమేకం అవుతూ వారి మన్ననలను పొందేలా విధులు నిర్వహిస్తున్నామని అన్నారు. పోలీస్ అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ, వారి ఆశయ సాధన కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు.
Also Read | తెలంగాణ నూతన స్పోర్ట్స్ పాలసీ నవంబర్ 2024 లోపు సిద్దం: సీఎం
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు, తన కుటుంబ క్షేమం కోసం విధిగా హెల్మెట్ తప్పక ధరించాలని కోరారు. వాహనదారులు ట్రాఫిక్-రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, వాహనదారులు చేసే చిన్నచిన్న తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి ప్రమాదాల కారణంగా వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తమ బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అధికంగా తలకు గాయం కావడం వలన వాహనదారులు మరణించడం జరుగుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పని సరిగా ధరించి, వాహనం నడపాలని ఎస్పీ కోరారు.