తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలంటే ఒక్కసారి తెలంగాణలో బిజెపికి అవకాశం ఇవ్వాలని హుజూర్ నగర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా శ్రీలత రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర కెసిఆర్ ది అని విమర్శించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పాలకీడు మండలం బోత్తల పాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.
తెలంగాణలో యువతకు ఉద్యోగాలు భర్తీ చేయకుండా కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఉచిత హామీలతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేనివారు.. ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తానంటే ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండని నాయకుడని అన్నారు. అలాంటి వారిని ఓడించాలని ప్రజలను కోరారు.
తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే అది బిజెపితోనే సాధ్యమవుతుందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే మహిళా సాధికారత సాధించేందుకు మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా బిజెపి పాలన ఉంటుందని చెప్పారు. తెలంగాణలో ప్రజలకు మంచి జరగాలంటే బిజెపి ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని ఆమె కోరారు.