ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సోమవారం సందర్శించారు. ఏపీకి జీవ నాడి అయిన పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నదని ఆయన తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాఫర్ డ్యామ్, స్పిల్ వే, డయాఫ్రమ్ వాల్ పనులపై ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టు కోసం తాను పడిన కష్టాన్ని జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారని చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించానని తెలిపారు. ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయని అన్నారు.
జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో టీడీపీ హయాంలోనే 72 శాతం ప్రాజెక్టు పనులను పూర్తి చేశామని అన్నారు. రాష్ట్రానికి శాపంగా వైఎస్ జగన్ మారారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారని.. ఏజెన్సీతో పాటు సిబ్బందినీ మార్చారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారని ఆరోపించారు. గతంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగి ఉంటే.. 2020 చివరి నాటికి పూర్తయ్యేదని అన్నారు.
తొలి క్షేత్ర స్థాయి పర్యటనగా పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం దానిపై పత్రికా సమావేశం నిర్వహించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. #Polavaram #AndhraPradesh
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 17, 2024
Link: https://t.co/ENSxvsWvK6 pic.twitter.com/7z951LZY00