ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉద్యగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఉద్యోగుల డిమండ్ లపై వారితో చర్చించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం తొలి మెట్టు అని అన్నారు.పెండింగ్ డీఏల విషయంలో రేపు సాయంత్రంలోగా ప్రభుత్వ నిర్ణయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా 317 జీవోపై కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించిన నేపథ్యంలో.. కేబినెట్ లో 317 జీవోపై నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.
సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ
ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అధ్యక్షతన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు, ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఉంటారని తెలిపారు. దీపావళి తరువాత శాఖలవారీగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నాయకులు తెలపారు. సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. త్వరలోనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని.. ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని వారు తెలిపారు.