జనగాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చేర్యాలలో 1270 గజాల పెద్ద చెరువు భూమిని కబ్జా చేసి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని అన్నారు. ఎమ్మెల్యే అయి ఉండి చెరువు భూమిని కబ్జా చేయటం తప్పు అని ఆమె అన్నారు. తనకు తెలియకుండా తన పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేపించటంపై ఆమె కొన్ని రోజుల క్రితమే పోలీసులను ఆశ్రయించారు. ఆ భూమి చుట్టూ ఉన్న ప్రహారీ గోడను ఆమె కూల్చి వేశారు. చేర్యాల ప్రజలు తమను క్షమించాలని భవానీ రెడ్డి మీడియా ముఖంగా ప్రజలను కోరారు.ఆ స్థలాన్ని చేర్యాల మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేస్తానని ఆమె తెలిపారు. ముతిరెడ్డికి ఎమ్మెల్యే కాకముందే వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని.. ఇప్పుడు భూ కబ్జాలు చేయటం సరికాదని ఆమె హితవు పలికారు. అలాగే ముత్తి రెడ్డి ఇచ్చిన ఆస్తులన్నీ చేర్యాల హాస్పిటల్ కు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని హామీ ఇచ్చారు.