కరెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఒక విధానం అంటూ ఏదీ లేదని, రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ భావం ఆ పార్టీకి తెలియవని విమర్శించారు. తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నదని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ లేక, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయి, రైతులు విధ్యుత్ కార్యాలయాల చూట్టూ తిరిగే దుస్థితి ఉండేదని అన్నారు. వేలాది మంది బలిదానాలు చేసుకుంటుంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఏనాడు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ యాస, భాషలను అవమానించిందన్నారు. అసెంబ్లీలోని బీఆర్‌ఎస్ శాసనభాపక్ష కార్యాలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదని, పోరాడి సాధించుకున్నామని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో ఏపని జరగాలన్నా ఢిల్లీ చుట్టూ ప్రధక్షిణలు చేయాలని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఒక ఆత్మని అన్నారు. టీడీపీ ప్రభుత్వం కరెంట్ బిల్లులు పెంచితే.. డిప్యూటీ స్పీకర్ గా ఉన్నకేసీఆర్.. చంద్రబాబు నాయుడుని ఎదిరించారని తెలిపారు. ఆ తరువాతనే నీళ్లు, నిధులు, నియామకాలపై పోరాటం, తెలంగాణ ఉధ్యమం మరింత ఉధృతం అయ్యాయని చెప్పారు. రైతాంగాన్ని చావగొట్టిన పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీదే అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.