తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఆరు నెలలైంది…. లోకసభ ఎన్నికల కోడ్ కూడా ముగిసింది… ఇకనైనా సాకులు మాని, మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీలను ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని పిసిసి చీఫ్ గా రేంత్ రెడ్డి మాటిచ్చారని, ఇప్పుడు ఆ మాటను మరచిపోయారని ఏలేటి గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి సిఎంగా బాధ్యతలు చేపట్టిన 99 రోజులకు పార్లమెంటు ఎన్నికల షెడ్యూలు వెలువడడంతో ఎలక్షన్ కోడ్ కారణంగా హామీల అమలు సాధ్యపడడం లేదని మీరు చెప్పుకుంటూ ఇన్నాల్లు తప్పించుకున్నారు. ఇపుడు ఎన్నికల కోడ్ ముగిసింది. మీరు అధికారంలోకి వచ్చి కూడా ఆరు నెలలైంది. కానీ మీరు ఇచ్చిన 420 హామీల్లో ప్రధాన అంశాలు మాత్రం ఎప్పటి నుంచి అమలు చేస్తారనే స్పష్టత ఇవ్వకపోవడమంటే మీకు ఓట్లు వేసి, అధికారాన్ని అప్పగించిన ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు.
రైతులకు రెండు లక్షల రూపాయల వరకున్న పంటరుణాలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2023 డిసెంబర్ 9వ తేదీనే ఏక కాలంలో మాఫీ చేస్తామన్న మాటను నిలబెట్టుకోకుండా మాట తప్పి అన్నదాతలను మోసం చేశారు. దాంతో లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతోందని గ్రహించి ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘిస్తూ రుణ మాఫీ హామీ అమలును ఆగస్టు 15కు వాయిదా వేసి రైతన్నల నమ్మకాన్ని కోల్పోయారు. ఫలితంగా లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ భంగపడింది. 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ 8 ఎంపీ సీట్లు గెలిస్తే … ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్న బిజెపి కూడా 8 లోకసభ సీట్లను గెలుచుకుంది. అంటే ప్రజలు కాంగ్రెసును తిరస్కరించినట్లే కదా. లోకసభ ఎన్నికలు మీ ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండం అని మీరే ప్రకటించారు. అంటే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా మోసం చేస్తున్న మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించినట్టే కదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని నిలదీశారు.
ప్రధానంగా రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువత, నిరుద్యోగుల వంటి పలు వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు జాడే కనిపించడం లేదని మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీల మాటేంటి. వ్యవసాయం – రైతు సంక్షేమం, నీటిపారుదల, యువత – ఉపాధి కల్పన, విద్యారంగం, వైద్యరంగం, గృహ నిర్మాణం, రెవెన్యూ, పౌరసరఫరాలు, పంచాయతీరాజ్- గ్రామీణాభివృద్ధి, పారిశ్రామిక రంగం, మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ వర్గాల సంక్షేమం, కార్మిక వర్గ సంక్షేమాలపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలేనా ముఖ్యమంత్రి గారూ… ఈ వాగ్దానాలను ఎలా అమలు చేయాలనే అంశంపై సిఎంగా మీరు అధికారులతో కనీస కసరత్తు కూడా చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఇది హామీల ఎగేవత ధోరణి కాదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టో ఛాప్టర్ – 2, ఆరు గ్యారంటీల కార్డులో మొదటిది మహాలక్ష్మీ స్కీము … మహిళలకు ప్రతి నెల రూ.2500. రెండో అంశంగా – రైతు భరోసా ప్రతి ఏటా అని హామీ ఇచ్చారు. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. వీటిని ఎప్పటి నుంచి అమలు చేస్తారు. వరి క్వింటాలుకు రూ. 500 బోనస్ కేవలం సన్న వడ్లకే అంటూ మెలిక పెట్టి అన్నదాతలను మోసగిస్తున్నారు. ఈ వరికి బోనస్ హామీని బోగస్ చేసిన విధంగానే మిగిలిన వాగ్దానాలను కూడా ఏదో మెలికలు, షరతులు విధించి నీరు గార్చాలని చూస్తే మాత్రం బిజెపి సహించదని, ప్రజల తరఫున నిలబడి ఇచ్చిన హామీల అమలుకు పోరాడుతామని మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టో ఛాప్టర్ – 2, ఆరు గ్యారంటీల కార్డులో ఐదో అంశంగా యువ వికాసం పేరుతో విద్యార్ధులకు రూ. ఐదు లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు, ఇక ఆరో అంశంగా చేయూత పధకం కింద పించన్లను నెలకు రూ.4000 కు పెంచుతామన్నారు కదా … మరి ఏమైంది? పాపం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులంతా తమ పెన్షన్ల మొత్తాన్ని ఎప్పుడు పెంచుతారని నిరీక్షిస్తున్నారు. యువతకు ఇచ్చిన హామీల అమలుపై కూడా అధికారులు, మంత్రులతో సిఎం ఎందుకని కసరత్తు చేయడం లేదు?
నిరుద్యోగ యవతకు 2024 ఫిబ్రవరి ఒకటో తేదీన గ్రూపు వన్ నియామకాలన్నారు. 2024 ఏప్రిల్ ఒకటిన గ్రూపు – 2 నియామకాలన్నారు. ఏమైంది? నిరుద్యోగ భృతి ప్రతి నెలా రూ.4000 ఇస్తామన్నారు. యువ మహిళా సాధికారత పేరుతో 18 ఏళ్లకు పైబడిన వారిలో చదువుకుంటున్న యవతులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ చేస్తామన్నారు. మరి వీటి అమలుకు సంబంధించిన కసరత్తేది… అధికారులతో మీటింగులేవి సిఎం గారు. రుణ మాఫీ మాదిరే ఈ హామీలను కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారో ఎందుకు చెప్పడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.
వాగ్దానాల అమలు కార్యాచరణపై కసరత్తు లేకపోవడంతో, కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను ఎగ్గొడుతుందనే అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. ప్రజల అనుమానాలు నివృత్తి చేసేలా హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాల్సిన బాధ్యతల నుంచి ముఖ్యమంత్రి తప్పించుకోలేరని చెప్పారు.
సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రతిరోజు ప్రజా దర్బారు అన్న హామీ అటకెక్కింది. ప్రజా దర్బార్ మొక్కుబడి తంతుగా సాగుతోంది. బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన కాళేశ్వరం కుంభకోణంపై న్యాయవిచారణ జరుగుతోంది, సరే, మరి ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలు జరిగాయా లేదా, జరిగితే అందుకు బాధ్యులపై చర్యలేవీ …. పౌర సేవల హక్కుల చట్టం తీసుకొస్తామన్నారు, కానీ దాని ఉసే లేదు. పథకాల అమలు కోసం వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు, కానీ అలాంటి కదలికే లేదు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి వేళ్ల మీద లెక్కించదగిన కొన్నింటిపై మాత్రమే మీ సర్కారు దృష్టి సారించింది. ఇంకా లెక్కకు మిక్కిలి హామీల అమలుపై మీ ప్రభుత్వంలో కదలికే లేదు. ఇది ముమ్మాటికీ ప్రజలను దగా చేయడమే. హామీల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని బిజెపి తీవ్రంగా ఆక్షేపిస్తోందని తెలిపారు. ఈ అలసత్వాన్నివీడి తక్షణమే హామీల అమలుపై అధికారులతో కసరత్తు మొదలెట్టి, వాగ్గానాల అమలును వెంటనే ప్రారంభించాలని, లేదంటే ఏ యే హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేస్తూ.. ముఖ్యమంత్రి కి రాసిన బహిరంగ లేఖను ఈ సందర్భంగా విడుదల చేశారు.