హర్యానాలో అక్టోబర్ 1న జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలన ఆ రాష్ట్ర బీజేపీ ఎన్నికల సంఘానికి (ఈసీ) విజ్ఞప్తి చేసింది. సుదీర్ఘ వారాంతం (లాంగ్ వీకెండ్) కారణంగా ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని చెబుతోంది. హర్యానా బీజేపీ చీఫ్ మోహన్‌లాల్ బడోలి ఈ మేరకు ఆగస్టు 22న ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
ఆయన రాసిన లేఖలో, “28వ తేదీ శనివారం, 29వ తేదీ ఆదివారం వస్తున్నాయి. ఈ రోజులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలకు వీక్లీ హాలిడే ఉంటుంది. అక్టోబర్ 1న పోలింగ్ రోజు కూడా చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడతాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా నేషనల్ హాలిడే ఉంటుంది. సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 2 వరకు హాలిడేల పొడిగింపుతో ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. అదనంగా, హర్యానాలో ఓటర్లలో గణనీయంగా ఉన్న బిష్ణోయ్ కమ్యూనిటీ.. రాజస్థాన్‌లోని ముఖమ్ గ్రామంలో జరిగే వార్షిక యాత్రకు వెళ్ళిపోతారు. ఈ కారణంగా అక్టోబర్ 1న పోలింగ్‌కు హాజరయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ కారణాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని, ఎక్కువ ఓటింగ్ శాతం సాధించేందుకు అక్టోబర్ 1వ తేదీకి బదులుగా మరో తేదీని పోలింగ్ రోజుగా ప్రకటించాలని.. పండుగల కారణంగా గతంలో కూడా ఓటింగ్ తేదీలను వాయిదా వేసిన సందర్భాలు ఉన్నాయి” అని బడోలి లేఖలో పేర్కొన్నారు.
బీజేపీకి ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఎన్నికల వాయిదా కోసం బీజేపీ చెప్పిన కారణాల్లో ఏమాత్రం పసలేదని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. అయితే, ఎన్నికల తేదీ మార్పుకు సంబందించి ఎన్నికల సంఘం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.