మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు (Maharashtra Assembly Elections) సమయం దగ్గర పడుతున్నది. నవంబర్ 20న ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 23వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల కమీషన్(Election commission) షెడ్యూల్ ను ప్రకటించింది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీల మద్య పొత్తులు, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై కీలక సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. దేశంలోని పెద్ద రాష్ట్రాలలో ఒకటైన మహారాష్ట్రలో ఎట్టి పరిస్థితుల్లో విజయకేతనం ఎగురవేయాలని ప్రధాన పార్టీలు అస్త్ర శస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి.
గత ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లు?
2019 శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీ (BJP), శివసేనా (Shiv Sena) రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీచేశాయి. బీజేపీకి 105 సీట్లు, శివసేనాకు 56 సీట్లు వచ్చాయి. మరో వైపు కాంగ్రెస్ పార్టీకి (congress party) 54 సీట్లు, ఎన్సీపికి (NCP) 44 స్థానాల్లో విజయం సాధించాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి పదవిని శివసేనకు ఇవ్వడానికి బీజేపీ నిరాకరించింది. దీంతో అనూహ్యంగా శివసేనా పార్టీ బీజేపీని కాదని తనకు సిద్దాంత పరంగా శత్రుపార్టీలు అయిన కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలతో పొత్తు పెట్టుకొని, ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. శివసేనా పార్టీ ఏక్ నాథ్ శిండే రూపంలో 2022లో పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. బీజేపీ మద్దతుతో శివసేనా చీలిక వర్గం నేత షిండే ముఖ్యమంత్రి అయ్యారు. మరో వైపు ఎన్సీపి పార్టీని కూడా బీజేపి చీల్చి 40 మంది ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ బీజేపీ కూటమిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. చీలిపోయి బయటికి వచ్చిన వారిదే అసలైన పార్టీ అని కోర్టులు కూడా తీర్పు చెప్పడం.. పార్టీ గుర్తు కూడా చీలిక వర్గం వారికే రావడం లాంటి పరిణామాలు మహారాష్ట్రలో జరిగాయి.
ప్రస్తుతం మహాయుతి(mahayuti) కూటమిలో బీజేపీ, శివసేన (షిండేవర్గం), ఎన్సీపి (అజిత్ పవార్ వర్గం) పార్టీలు ఉన్నాయి. మహా వికాస్ అఘాడీ (maha vikas aghadi) కూటమిలో కాంగ్రెస్, శివసేనా (ఉధ్దవ్ థాకరే వర్గం), ఎన్సీపి (శరత్ పవార్ వర్గం) పార్టీలు కొనసాగుతున్నాయి. ఈ కూటముల మధ్యే ప్రధాన పోటీ జరుగనుంది. ముఖ్యంగా వెన్ను పోటులు, కోర్టు కేసులు, సంచలనాల తర్వాత మరాఠా ఎన్నికల ఫలితాలు ఏవిధంగా ఉంటా యోనని యావత్ భారతదేశం చూస్తుంది.
ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు
ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి మహారాష్ట్రలో ఎదురుదెబ్బ తగిలింది. మెత్తం 48 ఎంపీ సీట్లకు గాను బీజేపీ కేవలం 9 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. షిండే వర్గానికి 7, అజిత్ పవార్ ఎన్సీపికి 8 సీట్లు వచ్చాయి. మరోవైపు కాంగ్రెస్ కు 13, ఉద్ధవ్ థాకరే శివసేనకు 9 సీట్లు, అజిత్ పవార్ ఎన్సీపికి 1 స్థానంలో విజయం సాధించాయి.
99 మందితో బీజేపీ మొదటి జాబితా
అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ ఇప్పటికే వ్యూహాలకు పదును పెడుతోంది. 99 మంది అభ్యర్థుల పేర్లతో మొదటి జాబితాను ఆదివారం (అక్టోబర్ 20) విడుదల చేసింది. ఈ విడతలో పలువురు కీలక నేతలు స్థానం సంపాదించారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ అశోక్ చవాన్, సుధీర్ ముంగంటి వార్ లతో పాటు పలువురు సీనియర్ నాయకుల వారసులకు మొదటి లిస్ట్ లో స్థానం లభించింది. 288 స్థానాల్లో బీజేపీ 151 సీట్లలో పోటీ చేయనుంది. మిగిలిన సీట్లను మిత్రపక్షాలకు కేటాయించనుంది. ఇంకా బీజేపీ 52 సీట్లకు గాను అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది.
भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने होने वाले महाराष्ट्र विधानसभा चुनाव 2024 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। (1/2) pic.twitter.com/DqMuh53UV5
— BJP (@BJP4India) October 20, 2024
వ్యూహాత్మకంగా మహా వికాస్ అఘాడీ
మరో వైపు ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహం, ప్రచారంపై ప్రత్యేకంగా ఏఐసీసీ పరిశీలకులు వ్యూహాలు రచిస్తున్నారు. మహా వికాస్ అఘాడీ కూటమిలో 200 సీట్లలో ఏకాభిప్రాయం కుదిరినట్టు శరద్ పవార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీఈసీ మీటింగ్ లో అభ్యర్ధుల ఎంపిక ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కాశ్మీర్, హర్యానాలో మిత్రపక్షాల విషయంలో జరిగిన తప్పులను రిపీట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని జాగ్రతలు తీసుకుంటుంది. ముఖ్యంగా కూటమిలోని మిత్రపక్షాలకు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి సైతం సిద్దంగా ఉందని సమాచారం. ఏఐసీసీ అబ్జర్వర్లుగా తెలంగాణ నుండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలు ముంబైకి వెళ్లారు. అక్కడ పార్టీ కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. హర్యానా, కాశ్మీర్ లలో జరిగిన పోలింగ్ లో పార్టీకి ఆదరణ పెరిగిందని తెలుస్తోందని వారు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు.