బెంగళూరులోజరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో పార్టీలన్నీకలిసి ప్రతిపక్ష కూటమికి INDIA(Indian National Developmental Inclusive Alliance) అనే పేరు ఖరారు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీతో తలపడనున్న ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ భారతదేశం ‘భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి’గా అభిర్ణించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీని ఢీ కొట్టేందుకు.. ప్రతిపక్షాల వ్యూహంపై చర్చించేందుకు 26 ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు జూలై 17-18 తేదీల్లో కర్ణాటక లోని బెంగళూరులో సమావేశమయ్యారు. రెండు రోజుల సమావేశాల్లో చర్చించిన తర్వాత, 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని ఎదుర్కోవడానికి ‘ఇండియా’అనే కూటమిని ఏర్పాటు చేయడానికి అందరం ఏకమయ్యామని వారు ప్రకటించారు. 11 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వచ్చేలోక్‌సభ ఎన్నికల్లో సమిష్టిగా పోరాడి విజయం సాధిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. కూటమి పేరుపై ఏకగ్రీవ ఒప్పందం కుదుర్చుకోవటమే కూటమి సాధించిన తొలి విజయం అని ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి.